ఖమ్మం రూరల్, జూలై 30 : ఎదులాపురం మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 3వ తేదీన బైపాస్ రోడ్డు యందు గల టీసీబీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వెయ్యి మంది ఉద్యోగ కుటుంబాల సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపాలిటీ ఉద్యోగుల, ఉపాధ్యాయ, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అధ్యక్షుడు ఎస్.విజయ్ తెలిపారు. బుధవారం జలగం నగర్‌లోని అసోసియేషన్ నాయకుడు జగన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలు, గ్రామాల్లో ఉద్యోగులు, ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారన్నారు. గత దశాబ్ద కాలంగా ఏదులాపురం పరిధిలో గృహాలు నిర్మించుకున్న ఆవాస ప్రాంత ప్రజలు కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం, పారిశుధ్య సమస్యలతో అలాగే మౌలిక వసతులైన రైతు బజార్ గ్రంథాలయం, స్టేడియం, సెంట్రల్ లైటింగ్ పార్కులు, జిమ్, ముక్క పురుగుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ఉద్యోగ జేఏసీ నాయకుడు ఏలూరు శ్రీనివాసరావు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సమాచార హక్కు చట్టం కమిషనర్ పివీ శ్రీనివాసరావు, ఎమ్మార్వో రాంప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు హాజరవుతున్నట్లు వెల్లడించారు.
కావున ఈ సమ్మేళనంలో ఉద్యోగులు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు ఎస్.విజయ్, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాస్, గౌరవాధ్యక్షుడు ఉడుగు వెంకటేశ్వర్లు, అసోసియేటెడ్ అధ్యక్షుడు శోభన్ కిషన్ నాయక్, ధరావత్ రాములు, జైపాల్, గౌరవ సలహాదారులు రామ్ నాయక్, ప్రసాదరావు, గంధసిరి మల్లయ్య, పి.వెంకటేశ్వరరావు, జైపాల్ పాల్గొన్నారు.