అశ్వారావుపేట, మార్చి 2: రైతులకు లాభదాయకమైన మునగ సాగుకు ప్రభుత్వం పూర్తి సబ్సిడీ ఇస్తున్నదని జిల్లా ఉద్యానాధికారి జంగా కిశోర్ తెలిపారు. స్థానిక ఆయిల్‌పాం తోటల్లో అంతర పంటగా సాగవుతున్న మునగను ఆదివారం పరిశీలించారు. రైతులతో ఆయన మాట్లాడుతూ.. మునగ సాగుతో ఎకరాకు ఏడాదికి సుమారు రూ.2 లక్షల వరకు ఆదాయం లభిస్తుందని చెప్పారు.
దీని సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంతర పంటగా వేసుకుంటే ఎకరాకు రూ.2,100, తోట నిర్వహణకు మరో రూ.2,100 చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుందని చెప్పారు. ప్రధాన పంటగా సాగు చేసుకున్నా కూడా ఉపాధి హామీ పథకం కింద 100 శాతం రాయితీ ఇస్తుందని అన్నారు. మునగ కాయలతోపాటు ఆకులను పొడి చేసి అమ్మడం ద్వారా కిలోకు రూ.30 చొప్పున అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. కొత్తగా వేసుకున్న పామాయిల్ తోటల్లో మొదటి మూడేళ్లు మునగ తోటను అంతర పంటగా సాగు చేసుకోవచ్చని అన్నారు.