భద్రాచలం, ఆగస్టు 21 : వృత్తి నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ.. గిరిజన యువత స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆకాంక్షించారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని వైటీసీని శుక్రవారం సందర్శించిన పీవో.. ఇప్పటివరకు శిక్షణ పొందిన వారు, వివిధ కోర్సుల్లో ప్రస్తుతానికి శిక్షణ పొందుతున్న వారు, రాబోయే బ్యాచ్‌ల వివరాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న గిరిజన యువతీ యువకులతో మాట్లాడి.. వారు పొందుతున్న శిక్షణ తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ వివిధ కోర్సుల్లో పొందిన శిక్షణను ఆచరణలో పెట్టాలని, ఉపాధి, ఆదాయ మార్గాలను పెంపొందించుకోవాలని సూచించారు. వివిధ సంస్థల్లో పనిచేసే క్రమంలో వినియోగదారులను మర్యాదపూర్వకంగా పలకరిస్తూ, వారి సమయం వృథా చేయకుండా అవసరమైన సేవలు అందించాలని సూచించారు.
బ్యూటీ థెరపిస్ట్, ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందిన యువతులు సొంతంగా వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎదగాలని, కుటుంబ పోషణకు అండగా నిలవాలన్నారు. యువతకు వృత్తి శిక్షణతోపాటు బాహ్య ప్రపంచంలో వస్తున్న నూతన సాంకేతిక, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించాలని ఫ్యాకల్టీలను ఆదేశించారు. కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, వైటీసీ మేనేజర్ శ్రీనివాస్, ఫ్యాకల్టీలు అనురాధ, అరుణ, దినకుమార్, రజియా బేగం, రామ్ ప్రకాశ్, సంధ్య, జ్యోతి, సమ్మయ్య, శిక్షణ పొందుతున్న యువతీ యువకులు పాల్గొన్నారు.