భద్రాచలం, అక్టోబర్ 14 : అర్హులైన నిరుపేద గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ఐటీడీఏ లక్ష్యమని భద్రాచలం ఐటీడీఏ ఏపీవో(జనరల్) డేవిడ్‌రాజ్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ గ్రామాల వచ్చిన గిరిజనుల నుంచి ఏపీవో అర్జీలు స్వీకరించారు. వాటిని ఆయా శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రైకార్ ద్వారా సబ్సిడీ రుణాలు, పోడు భూములు, వ్యక్తిగత సమస్యలు, స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి రుణాలు, పట్టా భూములకు రైతుబంధు, జీవనోపాధి పెంపొందించేందుకు ఆర్థిక సాయం, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేయించుకునేందుకు ఆర్థియ సాయం, గురుకులాల సీట్లు, పై చదువులకు ఆర్థిక సాయం కోసం అర్జీలు వచ్చినట్లు తెలిపారు.
అలాగే దసరా సెలవుల తర్వాత తిరిగి వసతి గృహాలకు చేరుకునే విద్యార్థులకు వార్డెన్లు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, గురుకులం ఆర్సీవో నాగార్జునరావు, డీటీ ఆర్వోఎఫ్ఆర్ లక్ష్మీనారాయణ, ఏపీవో(పవర్) మునీర్‌పాషా, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఉద్యాన అధికారి ఉదయ్‌కుమార్, డీఎంజీసీసీ సమ్మయ్య, ఎల్టీఆర్ ముదిరాజ్, డీఈ హరీశ్, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ప్రసాద్, భద్రమ్మ, మణికుమారి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.