కూసుమంచి, ఆగస్టు 11: ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో వరదల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 817 చెరువులు దెబ్బతిన్నాయని, రూ.250 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇరిగేషన్‌శాఖ ఈఎన్సీ నాగేంద్రరావు అన్నారు. శుక్రవారం ఆయన పాలేరు జలాశయంతోపాటు నాయకన్‌గూడెంలోని రిజర్వాయర్ ప్రధాన కాలువను పరిశీలించి అనంతరం విలేకర్లతో మాట్లాడారు. వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులు, చెరువు కట్టలు, వంతెనలకు మరమ్మతులు చేయిస్తున్నామన్నారు.
ఎగువన వర్షపాతం లేనందున జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్‌లో ఆశించినంత జలాలు లేవన్నారు. ప్రస్తుతం సాగర్ డ్యాం వద్ద ఇన్‌ఫ్లో తక్కువగా ఉందన్నారు. పాలేరు రిజర్వాయర్ షట్టర్స్ లీకు అవుతున్నందున వాటికి మరమ్మతులు చేయిస్తామన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందించాలంటే జలాశయంలో కనీస నీటిమట్టం ఉండాలన్నారు. మరమ్మతుల కారణంగా నీటి సరఫరాకు కాస్త ఇబ్బంది అవుతుందన్నారు. నాయకన్‌గూడెంలోని విశ్రాంతి భవన మరమ్మతులకు టెండర్లు పిలుస్తామన్నారు. ఈఎన్సీ వెంట చీఫ్ ఇంజినీర్ శంకర్‌నాయక్, ఎస్ఈ నర్సింగరావు, ఈఈలు మంగలపుడి వెంకటేశ్వర్లు, ఈఎన్సీ ఈఈ వెంకటరమణ, డీఈ జ్యోతి, జేఈ రమాదేవి ఉన్నారు.
నేలకొండపల్లి, ఆగస్టు 11: నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం పెద్ద చెరువును శుక్రవారం ఈఎన్సీ నాగేంద్రరావు పరిశీలించారు. చెరువు కట్టను పటిష్టం చేసేందుకు ఇటీవల నీటిపారుదలశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారని, చెరువుకట్టపై జంగిల్ క్లియరెన్స్ చేయించాల్సి ఉందన్నారు. అనంతరం రాజేశ్వరపురం వద్ద యూటీ వద్ద చేపడుతున్న లైనింగ్ పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు సలహాలు సూచనలిచ్చారు.