పాల్వంచ/ చుంచుపల్లి, మే 20: విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని డీఈవో వెంకటేశ్వరాచారి పేర్కొన్నారు. అందుకోసమే వాటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని భౌతిక, రసాయన శాస్ర్తాల ఉపాధ్యాయులకు ఐదు రోజులపాటు నిర్వహించనున్న జిల్లాస్థాయి వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని పాల్వంచ మండలం కొమ్ముగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రారంభించారు.
మొదటి రోజు శిక్షణ కార్యక్రమాన్ని డీఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్జెక్టుల్లో మెళకువలు నేర్చుకొనేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సబ్జెక్టులను సరళమైన పద్ధతిలో విద్యార్థులకు బోధించేందుకు ఉపాధ్యాయులు వీటిని వినియోగించుకోవాలని సూచించారు. కోర్సు కో ఆర్డినేటర్ సైదులు, డీఆర్పీలు సంపత్, ప్రభుసింగ్, ఆపక శంకర్, మోహన్రావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
చుంచుపల్లిలో..
చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ తరగతులు చుంచుపల్లి మండలం రుద్రంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఎంఈవో బాలాజీ ఈ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ఐదురోజుల పాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం, ప్రాథమిక తరగతుల విషయాల్లో డిజిటల్ టూల్స్ ద్వారా బోధన, ప్రస్తుత తెలంగాణ ప్రాథమిక విద్యలో ఎదురవుతున్న సమస్యలు మొదలైన అంశాలపై శిక్షణ ఉంటుందని చెప్పారు. మండలాల ఎంఆర్పీలు పాల్గొన్నారు.