హనుమకొండ, అక్టోబర్ 28: మొంథా తుపాన్ నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ పరిధి 16 సర్కిళ్లలోని విద్యుత్ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. తుపాన్ కాకినాడ తీర ప్రాంతాన్ని తాకే అవకాశం ఉందని తాజా వాతావరణ నివేదికల ఆధారంగా కొన్ని జిల్లాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని, ఇందులో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఫీల్డ్ అధికారులు 247 అప్రమత్తంగా ఉండాలనీ సీఎండీ ఆదేశించారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. రౌండ్ ది క్లాక్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని పేరొన్నారు. నష్టం సంభవించిన వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు తగిన సిబ్బంది, సామగ్రిని సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి అధికారి, సిబ్బంది తమ ప్రధాన కార్యాలయాల్లోనే ఉండి, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 16 సరిల్, డివిజన్ అధికారులు ప్రతి గంటకు ఒకసారి విద్యుత్ సరఫరా, నష్టం నివేదిక అందించాలని పేర్కొన్నారు.
అర్ధరాత్రి సైతం కూడా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేసేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ప్రమాదాల నివారణకు అవసరమైన పోల్స్, మెటీరియల్, క్రేన్లు, జనరేటర్లు, బ్రేక్‌డౌన్ బృందాలు, ఏజెన్సీలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ముందస్తుగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి విద్యుత్ సమస్యల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన సరఫరా అందించాలని సీఎండీ అధికారులను ఆదేశించారు.