ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 10 : గురుకుల విద్యాసంస్థల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకు కొనసాగుతున్న గురుకుల పర్యవేక్షణ అధికారుల స్థాయిల్లో ప్రభుత్వం మార్పులు తీసుకురావడం.. రీజినల్ కో ఆర్డినేటర్ల స్థానంలో జోనల్ ఆఫీసర్లుగా మార్పులు చేసినా.. వారు ఎక్కడ పని చేయాలో స్పష్టంగా పేర్కొనని పరిస్థితి. అంతేకాక గతంలో ఉన్న జిల్లాలకు అదనంగా మరో రెండు జిల్లాల బాధ్యతలను పెంచారు. అయితే దీనిపై విధి విధానాలను ఇంకా ప్రకటించకపోవడంతో గురుకులాల పర్యవేక్షణ గాలికొదిలేసినైట్లెంది.
ఎస్సీ గురుకుల విద్యాలయాల పరిధిలో రీజినల్ కోఆర్డినేటర్(ఆర్సీవో)ల స్థ్ధానంలో జోనల్ ఆఫీసర్లు(జడ్వో)గా నియమించారు. గతంలో ఆర్సీవోల పరిధిలో 29 లేదా 30 గురుకుల విద్యాలయాలు ఉండేవి. ఇప్పుడు జోనల్ ఆఫీసర్లుగా స్థాయి మార్చిన తర్వాత ఆ సంఖ్య 45 విద్యాలయాలకు చేరింది. గతంలో ఖమ్మం ఆర్సీవో పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలు ఉండేవి. ఇప్పుడు జోనల్ ఆఫీసర్ పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలు ఉన్నాయి. గతం కంటే ఇప్పుడు అదనంగా వరంగల్, హనుమకొండ జిల్లాలను చేర్చారు. అయితే ఆర్సీవోలు ఏయే విధులు నిర్వహించాలనే దానిపై జాబ్ చార్ట్ ఉన్నా.. జోనల్ ఆఫీసర్లు ఏ విధులు నిర్వహించాలనేది మాత్రం ఇరవై రోజులైనా స్పష్టం చేయలేదు.
విద్యాసంస్థలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తుండగా.. గురుకులాల పర్యవేక్షణను గాలికొదిలేశారు. నెలన్నర రోజుల నుంచి బదిలీల వల్ల చాలా విద్యాసంస్థల్లో మార్పులు జరగడం, పాత టీజీటీలు బదిలీ అయి కొత్త టీజీటీలు విధుల్లో చేరడం కొనసాగుతోంది. దీనికితోడు పదోన్నతులు కూడా చేపడుతున్నారు. అయితే వీటన్నింటినీ పర్యవేక్షించాల్సిన ఆర్సీవోల స్థాయిని కూడా మార్చడంతో గురుకుల విద్యాలయాల పరిధిలోని స్కూళ్లు, కళాశాలలను తనిఖీ చేసే వారు కరువయ్యారు. గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసే విషయంలో ఆయా గురుకుల ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకుంటే మినహా మరో అధికారి లేకపోవడంతో ఖాళీలకు సంబంధించిన సమాచారం కూడా విద్యార్థులకు అందే పరిస్థితి కనిపించడం లేదు.
ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒక జోన్‌గా చేశారు. దీనికి జోనల్ ఆఫీసర్(జడ్వో)గా స్వరూపరాణిని నియమించారు. ఈ క్రమంలో వరంగల్ కేంద్రంగా కార్యాలయం నిర్వహించేందుకు అధికారులు ఆలోచన చేయగా.. ఖమ్మంలో అత్యధికంగా గురుకులాలు ఉన్నాయని వివరించడంతో ఎక్కడ జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలనే దానిపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుమారు 20 రోజుల నుంచి జోనల్ అధికారులు ఎక్కడ విధులు నిర్వహించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఐదు జిల్లాల పరిధిలో ఐదుగురు కలెక్టర్లకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితితోపాటు సమీక్షలకు హాజరుకావాలంటే తలకు మించిన భారంగా మారనున్నది.