కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 7: కొత్తగూడెం ప్రభుత్వ ఖాజీ రషీద్ ఖాన్ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి తొలగించినట్టు అహలే సున్నత్వల్ జమాత్ జిల్లా చైర్మన్ ఎం ఏ.రజాక్ తెలిపారు. ఆదివారం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం కు చెందిన ప్రభుత్వ ఖాజీ రషీద్ ఖాన్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఏఎస్ జే సభ్యులు రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారన్నారు.
ఈ అంశం పై విచారణ జరిపి రషీద్ ఖాన్ ప్రవర్తన, ఇతరత్ర వ్యవహారాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో అవి నిజమేనని తేల్చి గత నెల 22న తొలగించినట్టు చైర్మన్ తెలిపారు. ఇక నుండి అతను ముస్లిం సమాజంలో శుభకార్యాలు చేయుటకు గానీ, ఇమాంగా, ఖాజీగా , కుటుంబ వివాదాలు పరిస్కరించు టకు గానీ అర్హుడు కాదని వివరించారు. ప్రభుత్వం కొత్త ఖాజీని నియమించే వరకు శుభకార్యాలకు, ఇతర కార్యకలాపాలకు పాల్వంచ ఖాజీని సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ గౌస్ మొయినుద్దీన్, ఎస్ కే.కరీం ఖాద్రి, షమీం, అలీముద్దీన్, ఇమాముద్దీన్, హుస్సేన్, ముస్లిం మత పెద్దలు రఫీ, దావూద్, నిస్సార్ తదితరులు పాల్గొన్నారు.