గవర్నమెంట్ ఆఫీసుల్లో కొంతమంది ఉద్యోగులు తమ వక్రబుద్ధి చూపిస్తూనే ఉన్నారు. నిరుపేదలు పనికోసం ప్రభుత్వ కార్యాలయం మెట్లెక్కితే చాలు.. పైసల కోసం పట్టుబడుతున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటును ఫిక్స్చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. చేయి తడపనిదే ఇసుమంత పని కూడా జరగడం లేదు. కనీసం రూ.10 అయినా ఇవ్వకుంటే అటెండర్ కూడా అధికారిని కలువనీయని పరిస్థితి దాపురించింది.
దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ కన్నేసింది. అక్రమార్కుల భరతం పట్టేందుకు గుట్టుచప్పుడు కాకుండా విచారణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే లంచావతారులు వరుసగా పట్టుబడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 15 కేసులు నమోదవడమే ఇందుకు ఉదాహరణ.
– మామిళ్లగూడెం, డిసెంబర్ 9
‘తెలంగాణను అవినీతి రహితంగా తీర్చిదిద్దుతాం.. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే ప్రజానీకానికి పారదర్శకంగా సేవలు అందించేలా చర్యలు తీసుకుంటాం..’ అంటూ ప్రకటించిన కాంగ్రెస్ ఏడాది పాలనలో అవినీతి జలగలు ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి. రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతున్నప్పటికీ వేలాది రూపాయల వేతనాలు పొందుతున్న కొందరు ఉద్యోగులు తమ వంకర బుద్ధిని వీడడం లేదు. బ్యూరోక్రాట్స్ దగ్గర్నుంచి కిందిస్థాయి అధికారులు, సిబ్బంది వరకు లంచం పుచ్చుకోనిదే పూటగడవని పరిస్థితి. ఈ విషయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మినహాయింపేమీ లేదు.
జిల్లాలో ప్రజలతో నేరుగా సంబంధమున్న గవర్నమెంట్ ఆఫీసుల్లో అవినీతి మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. మైనింగ్, ఆరోగ్య, ఆర్టీవో, రెవెన్యూ, విద్యుత్, రిజిస్ట్రేషన్స్, మున్సిపాలిటీ, పోలీసు, పంచాయతీరాజ్, కమర్షియల్ ట్యాక్స్, సంక్షేమ విభాగాలు తదితర శాఖల్లో అవినీతి పెచ్చుమీరింది. వీటితోపాటు విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించే శాఖల్లో సైతం అవినీతి వేళ్లూనుకుని పోయింది. ఒక్కోదానికి ఒక్కో రేటును ఫిక్స్చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అలా వచ్చిన అవినీతి సొమ్ము నుంచి ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారుల వరకు పర్సంటేజీలుగా పంచుకు తింటున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగుల సంక్షేమం కోసం ఎవ్వరికీ ఇవ్వని రాయితీలు గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. తెలంగాణ వచ్చీరాగానే ఇంక్రిమెంట్, వారి భార్యాపిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్‌కార్డులు ఇచ్చారు. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడొచ్చిన ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తుండడంతో అధికారులకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. దీంతో పనికోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్న ప్రజలను లంచాల కోసం పీక్కుతింటూనే ఉన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి.
అధికారులు లంచం అడిగితే ప్రజలు వెంటనే అవినీతి నిరోధక శాఖకు ఒక్క ఫోన్ చేస్తే చాలు స్పందిస్తాం. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) టోల్ ఫ్రీ నెంబర్ 1064పై పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాం. లంచం ఇవ్వవద్దు. లంచం తీసుకోవద్దు. అవినీతి అనేది దేశాభివృద్ధికి తీవ్ర ఆటంకం. అవినీతి నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత. మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రధాన కార్యాలయం నెంబర్లు-9154388989, 040-2325155 5, వాట్సప్ నెంబర్- 9440446106, ఈ-మెయిల్ dg_ acb@telangana.gov.in ఖమ్మం రేంజ్ కార్యాలయం నెంబర్లు-9154388981, 08742-228663, ఈ-మెయిల్ dsp_acb_kmm@telangana. gov.inను సంప్రదించవచ్చు.
– వై.రమేశ్, ఏసీబీ డీఎస్పీ, ఖమ్మం