భద్రాద్రి కొత్తగూడెం, జూలై 10 (నమస్తే తెలంగాణ) : అసలే అవి మూగజీవాలు. అడ్డం పడితే తప్ప వాటికి జబ్బు చేసిన విషయం వాటి యజమానులకు కూడా తెలియదు. అలాంటి మూగజీవాల వేదన భద్రాద్రి జిల్లాలో అరణ్య రోదన అవుతోంది. జబ్బు పడిన పశువులకు కనీసం ప్రభుత్వ వైద్యమూ అందని దయనీస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పశువైద్యశాలలన్నీ గబ్బు కొడుతున్నాయి. ఎప్పుడో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వమూ మొగ్గుచూపడం లేదు. దీంతో పెచ్చులూడుతున్న భవనాల్లోనే వైద్య సిబ్బంది భయంభయంగా విధులు నిర్వహించాల్సిన దుస్థితి. ఇక ఆ శిథిల భవనాల్లోనూ తగినన్ని మందులు లేవు. వైద్యులు అంతకంటే లేరు. సింహభాగం ఆసుప్రతుల్లో వైద్యులు, సహాయ సంచాలకుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
సిబ్బంది మాత్రమే పశువులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక అందుబాటులతో ఉన్న వాటిల్లో ఒకటీ రెండు మందులు ఇస్తున్నారు. మిగతా మందులకు ప్రిస్కిప్షన్ పట్టుకొని ప్రైవేటు పశువుల మందుల దుకాణాలకు వెళ్లాల్సి వస్తోంది. వర్షకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభం కావడం, జబ్బు పడిన పశువులతో వాటి యజమానులు పశువైద్యశాలలకు వస్తుండడం వంటి కారణాల నేపథ్యంలో జిల్లాలో పశువులకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేక కథనం.
నోరున్న మనిషి ఏ అర్ధరాత్రి అనారోగ్యం పాలైనా క్షణాల్లో ఆటోను పిలిచి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్తాం. కానీ నోరులేని మూగజీవాల పరిస్థితి అలాకాదు. అవి లేవలేని స్థితికి చేరుకుంటేగానీ పశు యజమానులు గుర్తించలేరు. ఒకవేళ పొద్దుపోయాక గుర్తించినా.. తెల్లవారాకే వాటిని దగ్గరల్లోని పశువైద్యశాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అవి లేవలేని స్థితిలో ఉంటే వాహనంలో ఎక్కించే తీసుకెళ్లాల్సిన స్థితి. ఇలా భద్రాద్రి జిల్లాలో జబ్బుపడుతున్న పశువులకు వైద్యం చేయించేందుకు వాటి యజమానులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లాలో పశువుల సంఖ్య ఎక్కువ. పాడి పశువులైన ఆవులు, గేదెలు, దుక్కిటెడ్లు సహా పెంపకపు జీవాలైన మేకలు, గొర్రెలు అత్యధికంగా ఉన్నాయి. ఇక సాదుజీవాలైన పెంపుడు కుక్కలు, కోళ్ల సంఖ్య కూడా అధికమే. ఇంత పెద్ద సంఖ్యలో మూగజీవాలున్న భద్రాద్రి జిల్లాలో పశువైద్య విభాగం మాత్రం అచేతనావస్థలో ఉండడం గమనార్హం.
జిల్లాలో ప్రభుత్వ వైద్యశాలల్లో సూది మందులుగానీ, సాధారణ మందులుగానీ తగినన్ని లేవు. తీవ్రమైన కొరత కారణంగా పశువుల యజమానులు ప్రిస్కిప్షన్లు పట్టుకొని ప్రైవేటులోని పశువుల మందుల దుకాణాలకు వెళ్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే.. గత ఏడు నెలలుగా వెటర్నరీ సబ్ సెంటర్లలో మందులు లేనేలేవు. దీంతో వైద్యులు, సిబ్బంది ప్రిస్కిప్షను రాసి పశువుల యజమానులు ఇస్తున్నారు. బయట తెచ్చుకోవాలంటూ పంపిస్తున్నారు. ఇక, మూడు రాష్ర్టాల సరిహద్దుగా ఉన్న భద్రాచలంలోని పశువైద్యశాలకు మూగజీవాల తాకిడి అధికంగా ఉంటుంది. ఇక్కడ సహాయ సంచాలకుడు (ఏడీ) స్థాయి వైద్యుడు ఉన్నాడు. కానీ డిప్యూటేషన్‌పై మరో ప్రాంతానికి వెళ్లాడు. దీంతో ఇద్దరు సిబ్బందే ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు.
జిల్లాలోని ప్రాథమిక వెటర్నరీ ఆసుపత్రులు 30, ఏడీ స్థాయి ఆసుపత్రులు 6, సబ్‌సెంటర్లు 44 ఉన్నాయి. ఇందులో అన్ని ఆసుపత్రులూ శిథిలావస్థలో ఉన్నాయి. వాటిల్లో విధులు నిర్వహించడానిక సిబ్బంది కూడా వెనుకడుగు వేస్తున్నారు. వర్షం వస్తే కురుస్తుంటాయి. పెచ్చులూడి పడుతుంటాయి. వెలుపలా, లోపలా గబ్బు కొడుతున్నాయి. పశు యజమానులు తమ పశువులను తీసుకెళ్లినా వాటికి అక్కడ వైద్యం చేయించలేని దైన్యమైన దుస్థిథి. తప్పకుంటే వెటర్నరీ అసిస్టెంట్లను బతిమిలాడుకుని మరీ పశువుల యజమానులు వారిని తమ ఇళ్ల వద్దకు పిలుచుకోవాల్సిన పరిస్థితి. మందులు ప్రైవేటు కొనుగోలు చేసుకోవాల్సిన దయనీయ స్థితి. వర్షాకాలం సీజన్ మొదలైన నేపథ్యంలో పశువులకు గురక వ్యాధి నివారణ వ్యాక్సిన్ తప్ప మరే మందులూ లేవు. ఇతర వ్యాధులు వచ్చినా, ప్రమాదాలు జరిగినా, విష సర్పాలు కాటువేసినా మందులు అందుబాటులో లేవు.
భద్రాద్రి జిల్లాలో మొత్తం 80 పశు వైద్యశాలలు ఉన్నాయి. వాటిల్లో 60 ఆసుపత్రులు మరమ్మతుల కోసం వేచి చూస్తున్నాయి. ఎర్రగుంట, కొమ్ముగూడెం, అన్నపురెడ్డిపల్లి, సంగెం ఆసుపత్రులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులో 30 ప్రాథమిక వెటర్నరీ ఆసుపత్రులున్నాయి. కొమరారం ఆసుపత్రిలో వైద్యుడి పోస్టు ఖాళీగా ఉంది. భద్రాచలం, పాల్వంచల్లోనూ ఏడీ స్థాయి పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఐదు సబ్ సెంటర్లలోనూ ఖాళీలే. అన్ని చోట్లా వెటర్నరీ సిబ్బందే పశువులకు ప్రాథమికంగా వైద్య సేవలందిస్తున్నారు.
పశువుల ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లినా మందులు లేవంటూ అక్కడి సిబ్బంది చెబుతున్నారు. దీంతో మా దగ్గర ఆసుపత్రి ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. ఆ ఆసుపత్రి భవనం కూడా ఎప్పుడు కూలిపోతుందో తెలియకుండా ఉంది. బయటి నుంచి వచ్చి పశువులను చూపించుకొని వెళ్లిపోతున్నాం. మందులను ప్రైవేటులో తెచ్చుకుంటున్నాం.
-కలకొండ శ్రీనివాసరావు, ఎర్రగుంట, అన్నపురెడ్డిపల్లి
ఇంత ఘోరం ఎక్కడైనా ఉంటుందా? పెంపుడు కుక్కను తీసుకువెళ్లినా సూది బయట తెచ్చుకోవాలని చెబుతున్నారు. చిట్టీలు రాసి చేతిలో పెడుతున్నారు. ఇక్కడ డాక్టర్ కూడా లేరు. సిబ్బందే వైద్యం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జీవాలు ఎక్కువగా ఉంటాయి. అయినా మందులు బయటే తెచ్చుకుంటున్నాం. మొబైల్ వ్యాన్ల ముచ్చటే లేదు.
-దొడ్డిపట్ల మణికంఠ, భద్రాచలం