ఆదివాసీలు అనాది నుంచి తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు.. ఒక తరం నుంచి మరో తరానికి తమ సంస్కృతిని అందిస్తున్నారు.. పూర్వీకుల వారసత్వాన్ని అందుకుని ప్రకృతిని ఆరాధిస్తూ, గ్రామదేవతలనే ఇలవేల్పుగా భావించి పూజలు చేస్తారు.. ఇదే కోవలో లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని గట్టుమళ్లకు చెందిన గొత్తికోయలు సోమవారం గ్రామంలో ‘పంటల పండుగ’ ప్రారంభించారు. మూడురోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తొలిరోజు వారి సంప్రదాయ వంట ‘లంద’ వండి విప్పచెట్ల వద్ద వెలసిన గ్రామదేవతలకు సమర్పించారు. తిరిగి ఇంటికి వచ్చి కుండల్లోని నీళ్లను కులపెద్దపై పోశారు. అనంతరం పిల్లాపాపలతో కలిసి తునికాకు డొప్పల్లో లంద తాగారు.
సంప్రదాయ వాద్యపు చప్పుళ్ల మధ్య నాట్యం చేస్తూ సందడి చేశారు. ధాన్యాన్ని మొలకలు వచ్చేదాక ఉంచి వాటి పొట్టు ఒలిచి, వాటిని నానబెట్టి ఎండబెట్టిన బియ్యపు పిండితో ‘లంద’ తయారు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. ఏటా పంట సీజన్ పూర్తవుతున్న సమయంలో ఈ పండుగ జరుపుకొంటామన్నారు.