కారేపల్లి, జూలై 28 : గోదావరి నదీ జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఉపయోగించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సంబంధించిన సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సోమవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి నది జలాలపై నిర్మించే ఎత్తిపోతల దుమ్ముగూడెం ప్రాజెక్టును అప్పటి సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2005లో రాజీవ్ సాగర్ ఎత్తిపోతల పథకం పేరుతో శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారన్నారు. మరలా గత సీఎం కేసీఆర్ దానిని సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుగా నామకరణం చేసి రోళ్లపాడు చెరువు వద్ద శంకుస్థాపన చేశారన్నారు. మొదట ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే ధృడ సంకల్పంతో ప్రారంభించారని గుర్తు చేశారు.
కానీ పాలకులు స్వార్ధ పూరిత ఆలోచనలతో ప్రాజెక్ట్ డిజైన్లో మార్పులు చేస్తూ ఏజెన్సీ ప్రాంతానికి చుక్కనీరు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న డిజైన్ వల్ల మొదటి దశలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలోని 26 మండలాలకు నీరు అందుతుందని, తర్వాత దశలో మిగతా ప్రాంతాలకు విస్తరింపజేస్తామని, అందులో 16 ఏజెన్సీ ప్రాంత మండలాలు ఉన్నప్పటికీ మైదాన ప్రాంత 10 మండలాల ఆయకట్టులో ఏజెన్సీ ప్రాంత మండలాలతో సగం కూడా ఉండదన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ క్రింద పేర్కొన్న ఆయకట్టులో మూడింట రెండు వంతుల పాత ఆయకట్టు స్థిరీకరణకు కేటాయించారన్నారు. మొత్తం 6,74,387 ఎకరాల సాగు ప్రతిపాదనతో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఆయకట్టులో 4 లక్షల 60 వేల ఎకరాలు ప్రస్తుత ఖమ్మం జిల్లా పరిథిలోనివే అన్నారు. మిగతా 3,14,387 ఎకరాలు పాత ఆయకట్టు స్థిరీకరణ కోసం డిజైన్ చేశారన్నారు. క్రమ క్రమంగా మారుతూ వస్తున్న డిజైన్లపై ఏజెన్సీ ప్రాంత రైతు సోదరుల నుండి అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోకుండా పనులు నడిపిస్తూ, ఏజెన్సీ ప్రాంత రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.
ఏజెన్సీ తలాపున ప్రవహించే గోదావరి నదీ జలాలపై నిర్మించే సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ కాల్వలు, పంపు హౌజ్ల వల్ల ఏజెన్సీ ప్రాంత రైతాంగం భూములను నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చట్టాలు ప్రాజెక్టుల క్రింద నష్టపోతున్న వారిని ప్రథమ లబ్ధిదారులుగా గుర్తించాలని చెబుతున్నప్పటికీ పాలకులు దానిని పెడచెవిన పెడుతున్నారన్నారు. గోదావరి నది జలాలను కృష్ణా నది ఆయకట్టు గ్యారెంటీ కోసం తీసుకెళ్లడం కంటే ముందు ఏజెన్సీ ప్రాంతాలు బయ్యారం, గార్ల, ఇల్లెందు, పినపాక నియోజకవర్గ ప్రాంతానికి తాగు, సాగునీరు అవసరాలను తీర్చాలని, ఆ తరువాతే బయటి ప్రాంతాలను తీసుకెళ్లాలని ఏజెన్సీ ప్రాంత రైతాంగం ప్రతిఘటిస్తోందన్నారు.
ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్ డిజైన్ వల్ల ఇల్లెందు, వైరా నియోజక వర్గాలకు చుక్క సాగునీరు పారదని, దీనిపై పునరాలోచన చేసి డిజైన్ మార్పులు చేస్తూ ఏజెన్సీ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని “గోదావరి జలాల సాధన కమిటీ” ద్వారా నీటిపారుదల మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు సత్వరం పూర్తి చేసి, ఇల్లెందు, వైరా నియోజక వర్గాల పరిధిలోని భూములకు నీరందించాలని ఆయన పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో కోపగాని శంకర్రావు, బండారి మోహన్ రావు ఉన్నారు.