– ప్రజాస్వామ్య పరిరక్షణకు దారి చూపిన పోరాటం
– ఐషీ ఘోష్, నాగరాజు
ఖమ్మం రూరల్, ఆగస్టు 31 : ఢిల్లీలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత చేపట్టిన పోరాటం స్ఫూర్తిదాయకమైనదని, చారిత్రాత్మకమైనదని ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు అన్నారు. ఆ పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా విద్యార్థులు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం రూరల్ మండల కేంద్రంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి. ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన ‘జెన్ జీ మీట్’ లో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఐ సి గోష్ మాట్లాడుతూ.. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థి, యువత ఉద్యమం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక కొత్త దిశను చూపించిందన్నారు.
విద్యార్థులు తమ విద్యా, ఉద్యోగ హక్కుల కోసం మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం కూడా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభావితం చేసే పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కేవలం వ్యక్తిగత సమస్యలు కావని, అవి ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉన్నాయని అన్నారు. విద్యను కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ వైపు నడిపించే విధానాలను వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ జంతర్ మంతర్ పోరాటం యువతలో ప్రశ్నించే తత్వానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందన్నారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రజనీకాంత్ మాట్లాడుతూ.. ఢిల్లీ జంతర్ మంతర్ పోరాటం స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కొరత, అధ్యాపకుల ఖాళీలు, ఫీజుల భారంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మమత ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటాలను నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను ఐక్యం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సాత్విక, జిల్లా కమిటీ సభ్యురాలు పూజిత, సుశాంత్, ఖమ్మం డివిజన్ అధ్యక్షుడు త్రినాథ్, డివిజన్ నాయకుడు శ్యామ్, లోకేష్ యువత, నాయకులు పాల్గొన్నారు.

‘జెన్ జీ పోరాటం స్ఫూర్తిదాయకం, చారిత్రాత్మకం’