వేంసూరు, ఫిబ్రవరి 25: సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానుందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ జలాలతో మండలంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందుతుందని స్పష్టంచేశారు. రూ.3.5 కోట్ల నిధులతో మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో శుక్రవారం వారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాధించుకున్న తెలంగాణలో పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. అనంతరం చౌడవరంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. జనరిక్ మెడికల్ షాపు నిర్వహణ కోసం వహిదా స్వయం సహాయ సంఘానికి రూ.3 లక్షల చెక్కును అందజేశారు.
రాయుడుపాలెం, కల్లూరుగూడెం, వైఎస్ బంజర, అడసర్లపాడు, రామన్నపాలెం, బీరాపల్లి, మొద్దులగూడెం గ్రామాల్లో డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. రాయుడుపాలెం, వైఎస్.బంజరలో నూతన పంచాయతీ భవనాలు, అడసర్లపాడు, రామన్నపాలెం, బీరాపల్లి గ్రామాల్లో కమ్యునిటీ హాళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. అడసర్లపాడులో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ నామా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమమే సీఎం ప్రధాన ధ్యేయమని అన్నారు. రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. దేశంలోని అనేక రాష్ర్టాలు తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నాయని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, పగుట్ల వెంకటేశ్వరరావు, మారోజు సుమలత, పుచ్చకాయల శంకర్‌రెడ్డి, విద్యాచందన, సూర్యనారాయణ, రమేశ్, రంజిత్‌కుమార్, వాసు, జయలక్ష్మి, చలంచర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.