భద్రాద్రి కొత్తగూడెం, మే 19 (నమస్తే తెలంగాణ): గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం సోమవారం భద్రాద్రి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నందున.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాకేశ్‌రెడ్డి విజయం కోసం జిల్లాకు వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్.. తొలుత ఇల్లెందులోనూ, తరువాత కొత్తగూడెంలోనూ పట్టభద్రులతో సమావేశమవుతారని అన్నారు. సమావేశాలకు ఆయా నియోజకవర్గాల్లోని గ్రాడ్యుయేట్లు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.