అశ్వారావుపేట రూరల్, జూలై 20 : పెదవాగు ప్రాజెక్టు వరదతో పంటలు, ఇళ్లు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గుమ్మడవల్లిలోని పెదవాగు ప్రాజెక్టు గండిపడిన ప్రాంతాన్ని,కట్ట మైసమ్మ వద్ద ముంపునకు గురైన పంటలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 16 వేల ఎకరాలకు సాగునీరు అందించి.. ఎందరో రైతులకు బతుకునిస్తున్న ప్రాజెక్టుకు గండిపడి పంట భూములను బీళ్లుగా మార్చిందన్నారు. ఇసుక మేటలు వేసిన ఒక ఎకరానికి రూ.50 వేలు, ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా దెబ్బతిన్న వారికి రూ.3 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు.
అధికారుల తప్పిదం వల్లే ప్రాజెక్టుకు గండి పడిందని, దీనికి సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలన్నారు. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులపై రాజకీయాలు వద్దని, ఈ వర్షాలకు రెండు ప్రాజెక్టుల్లో నీరు చేరి నిండుకుండలా ఉన్నాయన్నారు. ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో ప్రాజెక్టుకు గండిపడినా.. వారు జిల్లాను వదిలి హైదరాబాద్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు. రుణమాఫీకి తెల్లకార్డు నిబంధనలు తొలగించాలని, అర్హులందరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, మోహన్‌రెడ్డి, సత్యవరపు సంపూర్ణ, చందా లక్ష్మీనర్సయ్య, నారం రాజశేఖర్, పుట్టా సత్యం, యార్లగడ్డ శ్రీను, ఏసుబాబు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.