బయ్యారం, మే 12: దేశం గతిని మార్చే నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు స్పష్టం చేశారు. అభివృద్ధికి నోచుకోక, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న దేశ ప్రజలకు అండగా నిలిచేందుకే బీఆర్ఎస్ను స్థాపించారని అన్నారు. బయ్యారం మండల కేంద్రంలో ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. నాడు సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలతో జనం అరిగోపడ్డారని, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. ప్రస్తుతం యావత్ దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదగడం వెనక సీఎం కేసీఆర్ కృషి ఎంతో ఉందని స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యుత్తమ సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని తెలిపారు. అవి తమ రాష్ట్రంలోనూ కావాలని ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని, సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం యావత్ దేశమే ఆశగా ఎదురుచూస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. భద్రాద్రి జిల్లాలో రూ.13 వేల కోట్లతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఇల్లెందుకు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయనున్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే హరిప్రియానాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
మూడోసారీ బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు శ్రేణులు కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌పైనా, బీఆర్ఎస్పైనా అసత్య ఆరోపణలు చేసే వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళన సందర్భంగా బయ్యారం, కొత్తపేట, గంధంపల్లి గ్రామాలు గులాబీమయమయ్యాయి. 400 బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు హరిసింగ్‌నాయక్, మాధవరావు, వెంకటేశ్వర్లు, గణేశ్, మౌనిక, మధుకర్‌రెడ్డి, సత్యనాయణ, కోటమ్మ, కృష్ణకుమారి, శైలజారెడ్డి, ఉప్పలయ్య, సోమిరెడ్డి, రామ్మూర్తి, ప్రభాకర్‌రెడ్డి, ఐ లయ్య, మురళి, సుగుణ పాల్గొన్నారు.