భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం పట్టణ అభివృద్ధికి రూ.40 కోట్లు, పాల్వంచకు రూ.40 కోట్లు, మణుగూరుకు రూ.25 కోట్లు, ఇల్లెందుకు రూ.25 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామని, తద్వారా నాలుగు మున్సిపాలిటీల అభివృద్ధికి బాటలు వేస్తామని ముఖ్యమంత్రి కల్వంకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం ఆయన మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారితో కలిసి కొత్తగూడెంలో సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి జిల్లాకు వరాలు కురిపించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనేక సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు. వానకాలంలో కొత్తగూడెం, పాల్వంచలో మొర్రేడు వాగు వరదల నివారణకు చర్యలు చేపడతామని సీఎం తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. గోదావరిపై 37 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో సీతారామ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని, పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగు నీరు అందుతుందన్నారు. ఏజెన్సీ జిల్లా భద్రాద్రిలో మొత్తం 481 పంచాయతీలు ఉన్నాయన్నారు. వాటి అభివృద్ధికి ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు.దీంతో సభకు హాజరైన సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
కొత్తగూడేనికి పాల్వంచకు మధ్యలో ఉన్న కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్ (కేఎస్ఎం) ఇంజినీరింగ్ కాలేజీ అనేక సమస్యల్లో కూరుకుపోయిందని, వాటిని పరిష్కరించాలని విద్యార్థులు కోరడంతో సీఎం వెంటనే స్పందించారు. సమస్యలను పరిశీలించి కాలేజీ పూర్తిస్థాయి యూనివర్సిటీగా రూపాంతరం చెందడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సూచించారు. కాలేజీ యూనివర్సిటీ అయితే మున్ముందు కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తాయన్నారు.
కొత్తగూడెం క్రైం, జనవరి 12: భద్రాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు పటిష్ట బందోబస్తు నిర్వహించి ‘శభాష్’ అనిపించుకున్నారు జిల్లా పోలీసులు. నూతన కలెక్టరేట్, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కొత్తగూడేనికి రావడంతో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉదయం నుంచే జిల్లా కేంద్రంలో ఆంక్షలను విధించారు. వ్యాపార సముదాయాలను సైతం ముందుగానే బంద్ చేయించారు. కొత్తగూడెం – పాల్వంచ పట్టణ రహదారుల్లో వన్‌వే మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించి సమస్యలు తలెత్తకుండా విధులు నిర్వర్తించారు. నూతన కలెక్టరేట్ వద్ద ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాటు చేసిన బందోబస్తును ఎస్పీ వినీత్ ఎప్పటికప్పుడు సమీక్షించారు. సుమారు 2వేల మంది పోలీసు అధికారులు, సిబ్బందితో జరిగిన ఈ బందోబస్తులో ఎస్పీతోపాటు మరో నలుగురు ఐపీఎస్ అధికారులు విధులు నిర్వర్తించారు. భూపాలపల్లి ఎస్పీ సురేందర్‌రెడ్డి, మంచిర్యాల డీసీపీ అఖిల్ మహజన్ సభా ప్రాంగణాన్ని పర్యవేక్షించారు. ఏఎస్పీలు రోహిత్‌రాజు, అక్షాంశ్ యాదవ్, రామ్‌నాథ్ కాకెన్ ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయపరిచారు.
ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కొందరు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందాయని, అందని వారికి స్థలాలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. సమస్యపై సీఎం సానుకూలంగా స్పందించారు. సింగరేణి ప్రాంతంలో ఖాళీ స్థలాలను గుర్తించి, సంస్థ సీఎండీ శ్రీధర్‌తో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపిస్తానన్నారు. ఎమ్మెల్యే వనమా సీనియర్ నాయకుడని, ఇప్పటికీ యువకుడిలా పనిచేస్తున్నారని సీఎం అభినందించారు.