బోనకల్లు, జూలై 14 : వ్యవసాయ కూలీలకు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు తెలిపారు. బోనకల్లు మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ వర్క్ షాపు బట్టు పురుషోత్తం అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనట్లు తెలిపారు. వ్యవసాయ సీజన్ ముగిసిన తర్వాత పనులు లేక కూలీలు ఆంధ్రా ప్రాంతానికి ఉపాధి కోసం వలస పోతున్నారన్నారు.
ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయని విమర్శించారు. మధిర డివిజన్ వ్యాప్తంగా ఈనెల 25 నాటికి అన్ని గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ కమిటీలను వేయాలని, 28 నాటికి మండల మహాసభలు పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్ను యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలన్నారు. గోదావరి జలాలను పాలేరులో కలపడం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయానికి తిరుగుండదన్నారు. రైతులకు పుష్కలంగా సాగునీరు లభిస్తుందని దీని ఫలితంగా కూలీలకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి కిలారు సురేశ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బంధం శ్రీనివాసరావు, వత్సవాయి జానకి రాముల, వేల్పుల భద్రయ్య, మంద సైదులు, కొమ్మినేని సీతారాములు, ఉప్పర శ్రీను, కొండా నాగేశ్వరరావు, చట్టు వీరబాబు, జివిఆర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.