మామిళ్లగూడెం/కొణిజర్ల, ఆగస్టు 17 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఎకరానికి రూ.15 వేలు రైతు భరోసా అందిస్తామని చెప్పి మోసం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన 50 మంది రైతులు.. తమకు రుణమాఫీ జరగలేదని, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం కలెక్టరేట్లోని సహాయ కేంద్రానికి చేరుకున్నారు.
వెంటనే కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రధాన గేటు ముందు నుంచి జాతీయ రహదారిపైకి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి, జిల్లా మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా బ్యాంకుల్లో ఉన్న తమ రుణాలు మాఫీ కాలేదని, వ్యవసాయాధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా.. తమకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వాపోయారు.
రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందని అధికారులను అడిగినా సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు. గంటపాటు ధర్నా చేసిన రైతులు మళ్లీ ఆగ్రహంతో కలెక్టరేట్‌లోకి చొచ్చుకొచ్చారు. దీంతో అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా తగ్గకుండా కలెక్టర్ చాంబర్ వరకు వెళ్లిన రైతులతో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చర్చలు జరిపారు. సమస్యను పరిష్కరించేందకు చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ఉన్నతాధికారులకు సమస్యను వివరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.