ఖమ్మం/ కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఏప్రిల్ 9: ఎన్నికల హామీ మేరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్ అనుబంధ) ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం, భద్రాద్రి కలెక్టరేట్ల ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. తొలుత వి.వెంకటాయపాలెం గ్రామ సెంటర్ నుంచి ప్రదర్శనగా ఖమ్మం కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకొని బైఠాయించారు.
పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు బాగం హేమంతరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ పాలకులు రైతు వ్యతిరేక విధానాలు అలంబిస్తుండడంతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి సుమారు రూ.46 వేల కోట్లు అవసరం ఉండగా.. ప్రభుత్వం రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఇప్పటివరకు రూ.20,600 కోట్లు మాత్రమే మాఫీ చేసి అంతా పూర్తయిందని చెప్పడం సరికాదన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేశ్, నాయకులు మిడికంటి వెంకటరెడ్డి, కూచిపుడి రవి, ఏపూరి రవీంద్రబాబు, జకుల రామారావు, చండ్ర నరేంద్రకుమార్, కల్లూరి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, నరాటి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.