Monkeys | జూలూరుపాడు, ఆగస్టు 30 : అకాల వర్షాలు, తీవ్ర వర్షాభావం వంటి ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు.. పురుగు మందులు, ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా మార్కెట్లో పంటకు దక్కని గిట్టుబాటు ధర మరోవైపు.. వెరసి వ్యవసాయం అంటేనే నేడు నిత్య సంక్షోభంగా మారింది. అప్పులు తెచ్చి, రక్తాన్ని చెమటగా మార్చి సాగు చేస్తే చివరకు మిగిలేది కన్నీళ్లే. ఇలాంటి అనేక కష్టాల నడుమ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా వచ్చిపడిన వానరాల బెడద రైతు వెన్ను విరుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన రైతు వేముల నాగయ్యతోపాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు అనుభవిస్తున్న నరకయాతన ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.
కాకర్ల గ్రామానికి ఆనుకుని ఉన్న తన పొలంలో నాగయ్య ఎన్నో ఆశలతో పత్తి సాగు చేపట్టాడు. ప్రస్తుతం పంట కాపు, పూత, పిందె దశకు చేరుకుంది. రైతుకు అత్యంత కీలకమైన ఈ సమయంలో ఊళ్లోని వేల సంఖ్యలో ఉన్న కోతులు నిత్యం దండులా చేనుపై విరుచుకుపడుతున్నాయి. పూతను తుంచేయడం, పిందెలను కొరికి పారేయడం, కాయలను రాల్చేయడంతో చేతికి అందాల్సిన పంట కళ్లముందే బుగ్గిపాలవుతోంది. మార్కెట్లో ఆశించిన ధర రాకపోయినా కనీసం పెట్టుబడైనా దక్కుతుందన్న ఆశను ఈ కోతుల మంద సర్వనాశనం చేస్తున్నాయి.
కోతుల దాడి నుంచి పంటను కాపాడుకునేందుకు నాగయ్య కుటుంబం మొత్తం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో చేనులోనే కాపలాగా ఉండాల్సి వస్తోంది. దీంతో ఇతర కూలీ పనులకు వెళ్లే అవకాశం లేక, రోజువారీ జీవనం గడవడం కూడా భారంగా మారింది. ఎండనక, వాననక గంటల తరబడి కేకలు వేస్తూ, రాళ్లు విసురుతూ కోతులను తోలినా ఫలితం శూన్యమైంది.
నిత్యం పడుతున్న ఈ మానసిక, శారీరక క్షోభకు ఎలాగైనా తెరదించాలని భావించిన నాగయ్య, ఆన్లైన్లో రూ.1,500 వెచ్చించి భయంకరమైన నల్లటి బొచ్చుతో కూడిన ఎలుగుబంటి కాస్ట్యూమ్ ను వికృతమైన మాస్క్‌ను తెప్పించుకున్నాడు. కోతుల గుంపులు రాగానే నాగయ్య ఆ నల్లటి ఎలుగుబంటి డ్రెస్సును ధరించి, చేతులను పైకెత్తి అడవి మృగంలా అరుస్తూ చేల గట్ల వెంట దూసుకెళ్తున్నాడు. దీంతో నిజమైన ఎలుగుబంటే వచ్చి పడిందని భావిస్తున్న వానరమూకలు ప్రాణభయంతో వణికిపోతూ గ్రామ పొలిమేరలు దాటే వరకు పరుగులు తీస్తున్నాయి.
ఎలుగుబంటి వేషంలో కోతులను తరిమికొడుతున్న దృశ్యం పైకి వింతగా అనిపించినా, ఆ డ్రెస్సు లోపల నాగయ్య పడుతున్న వేదన వర్ణనాతీతం. మండుటెండలో, తీవ్రమైన ఉక్కపోత నడుమ బరువైన నల్లటి బొచ్చు డ్రెస్సు వేసుకుని చేను చుట్టూ పరిగెత్తడం ప్రాణసంకటంగా మారింది. ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దవుతున్నా, ఊపిరాడని స్థితి ఎదురవుతున్నా పంటను దక్కించుకోవాలన్న ఆరాటంతోనే ఆ నరకయాతనను భరిస్తున్నాడు. ఒక వైపు తెగుళ్లు, మార్కెట్‌కు వెళ్తే పెట్టిన పెట్టుబడి కూడా రాని గిట్టుబాటు ధరల పరిస్థితి. వీటన్నింటికీ తోడు ఈ కోతుల బెడద మా బతుకులను ఆగమాగం చేస్తోంది. రైతుగా పుట్టి పొలంలో ఈ ఎండలో ఎలుగుబంటి వేషం వేసుకుని తిరగాల్సి రావడం ఎంత అవమానమో, ఎంత కష్టమో నాకే తెలుసు. కానీ ఏడాది కష్టాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోను ఇప్పటికైనా ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు స్పందించి కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి మమ్మల్ని ఆదుకోవాలని నాగయ్య అధికారులను వేడుకుంటున్నాడు.
తన పంటను రక్షించుకోవడానికి స్వయంగా ‘మృగం’గా మారి పోరాడాల్సి రావడం మన వ్యవసాయ వ్యవస్థ దుస్థితికి నిదర్శనం. నాగయ్య పడుతున్న ఈ శ్రమకు, ఆయన కన్నీళ్లకు తెరపడాలంటే అధికార యంత్రాంగం వెంటనే స్పందించి గ్రామాల్లో వానరాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Switzerland | స్విట్జర్లాండ్ రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు
వైభవంగా మార్వాడీల కావడి యాత్ర.. హరిహర మహాదేవ’ నామస్మరణతో సాగిన భక్తుల పాదయాత్ర
TVK vs Cong | కాబోయే ప్రధాని విజయ్ అంటూ జోరుగా ప్రచారం.. అధికార కూటిమిలో కలకలం..!