కారేపల్లి, ఆగస్టు 30: మార్వాడీల కావడి యాత్ర ఆదివారం వైభవంగా సాగింది. ఖమ్మం పట్టణంలోని రామ్‌దేవ్ బాబా మందిరం వద్ద ఉదయాన్నే ప్రారంభమైన ఈ యాత్ర ఎన్టీఆర్ సర్కిల్, ఖానాపురం, బల్లేపల్లి, రఘునాథపాలెం, మంచుకొండ, బూడిదంపాడు, పండితాపురం, ముచ్చర్ల, లింగాల, కారేపల్లి క్రాస్ రోడ్, సింగరేణి, అప్పాయిగూడెం, భాగ్యనగర్ తండా, ఆలియా తండాల మీదుగా ఇల్లెందు పట్టణంలోని రామ్‌దేవ్ బాబా ఆలయానికి చేరుకుంది.
మార్వాడీ కుటుంబాలకు చెందిన వందలాది మంది భక్తులు కావడి యాత్రలో పాల్గొన్నారు. ప్రతి ఏటా శ్రావణమాసంలో కుటుంబ బంధాలు బాగుండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు విస్తారంగా కురవాలని కోరుకుంటూ మార్వాడీలు కావడి యాత్ర చేపడతారు.
భక్తులు కావడికి పవిత్ర జలాలను కట్టుకుని ‘బోల్ బమ్’, ‘హరిహర మహాదేవ’ నామస్మరణ చేస్తూ రామ్‌దేవ్ బాబా, శివాలయాలకు చేరుకున్నారు. యాత్రలో మహిళలు, చిన్నారులు, యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
కాలినడకన ఇల్లెందులోని ఆలయానికి చేరుకున్న భక్తులు పవిత్ర జలంతో అభిషేకాలు, పూజలు నిర్వహించి కావడి యాత్రను ముగించారు.