మణుగూరు టౌన్, ఆగస్టు 31: సింగరేణి సంస్థ యాజమాన్యం భూ నిర్వాసితులకు అందించే ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కాజేసేందుకు కొంతమంది ‘నకిలీ’లు బయలుదేరారు. తప్పుడు పత్రాలు సృష్టించి తాము కూడా నిర్వాసితులమే అంటూ తెరపైకి వస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. సింగరేణి మణుగూరు ఏరియాలోని మణుగూరు ఓసీ విస్తరణలో భాగంగా యాజమాన్యం ఆర్అండ్ఆర్ ప్యాకేజీని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం తెరపైకి వచ్చింది.
పాత డాక్యుమెంట్లను రూ.10 వేల చొప్పున కొనుగోలు చేసుకొని ఎన్నో ఏళ్లుగా తాము కూడా ఇక్కడే ఉంటున్నామని, తమకు కూడా పరిహారం అందించాలని కొంతమంది ముందుకొచ్చారు. అయితే భూ నిర్వాసితుల పత్రాలు కంటే బినామీ పత్రాలే అధికంగా ఉండటంతో దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కొట్టేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారని స్పష్టమవుతోంది.
ఆందోళనలో అసలు నిర్వాసితులు
నకిలీపత్రాల వ్యవహారం బయటపడటంతో అసలైన నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ఈ గొడవల నేపథ్యంలో అసలైన తమకు ఎక్కడ పరిహారం రాకుండా పోతుందోనని భయపడుతున్నారు. అధికారులు సమగ్ర విచారణ చేసి సర్వం కోల్పోతున్న అసలైన నిర్వాసితులకే ఆర్అండ్ఆర్ ప్యాకేజీని అమలు చేయాలని వేడుకుంటున్నారు.
కఠినచర్యలు తీసుకుంటాం..
నకిలీ డాక్యుమెంట్లతో ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కాజేయాలని చూస్తే కఠినచర్యలు తీసుకుంటామని భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్ సుమ హెచ్చరించారు. మణుగూరు తహసీల్దార్‌తో కలిసి ఆమె నిర్వాసిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం తిర్లాపురం, రామానుజవరంలో సర్వే కొనసాగుతోందని, సర్వేకు రైతులు మంచిగా సహకరిస్తున్నారని అన్నారు. రైతులందరూ ఫీల్డ్ మీద ఉండి సర్వే చేయించుకోవాలని సూచించారు. బాండ్ పేపర్లు ఫోరెన్సిక్ పరిశీలనకు పంపిస్తామని తెలిపారు.
– సుమ, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్