మద్యం దుకాణాల లైసెన్స్‌ల ప్రక్రియను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు గురువారం ప్రారంభించారు. రెండు జిల్లాల కలెక్టర్లు సామాజిక వర్గాల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయగా.. అధికారులు అందుకు తగ్గట్లుగా కసరత్తు షురూ చేశారు. లైసెన్స్‌ల జారీకి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. ఆ వెంటనే దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. కొత్తగా జారీ అయ్యే లైసెన్స్‌లు డిసెంబర్ 1 నుంచి మనుగడలోకి రానున్నాయి.
ఖమ్మం, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కొత్తగూడెం క్రైం: మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిధిలో గురువారం నుంచి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుత మద్యం విధానం నవంబర్ 30తో ముగియనున్నది. కొత్తగా జారీ అయ్యే లైసెన్స్‌లు డిసెంబర్ 1 నుంచి మనుగడలోకి రానున్నాయి. ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆల గురువారం జిల్లాకేంద్రాల్లోని కలెక్టరేట్లలో లక్కీ డ్రా నిర్వహించి సామాజికవర్గాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీని ప్రకారం గౌడ కులస్థులకు 18 షాపులు, ఎస్సీలకు 10, ఎస్టీలకు ఎనిమిది మద్యం దుకాణాల కేటాయింపు జరిగింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 122 మద్యం దుకాణాలకు గాను 82 మద్యం దుకాణాలకు అధికారులు లైసెన్సులు ఇవ్వనున్నారు. భద్రాద్రి జిల్లాలో 88 మద్యం దుకాణాలకు గాను 44 దుకాణాలు, ఎస్టీలకు ఖరారయ్యాయి. మిగిలిన 44 దుకాణాల్లో 13 దుకాణాలను ఎస్సీ, గౌడ రిజర్వేషన్లకు కేటాయిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. శుక్రవారం ఉదయం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈనెల 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనున్నది.
ఫీజు.. రిజర్వేషన్లు ఇలా..
ఈసారి కూడా ప్రభుత్వం లైసెన్సు దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలుగా నిర్ణయించింది. జిల్లా పరిధిలోని మద్యం దుకాణాల్లో 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం కేటాయింపులు జరుగుతాయి. ప్రస్తుతం గతంలో మద్యం దుకాణాలను దక్కించుకున్న వారితోపాటు కొత్తగా ఎంతోమంది ఆశావహులు లైసెన్స్‌లు దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నారు. లైసెన్సుల జారీ ప్రక్రియ లాటరీ పద్ధతిలో జరుగనున్నది. ఈనెల 21న లాటరీ ప్రక్రియ పూర్తి కానున్నది. లైసెన్సులు దక్కించుకున్న వారు 22న మొదటి వాయిదా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉన్నది. నవంబర్ 30 నుంచి కొత్తగా షాపులు దక్కించుకున్న వారికి మద్యం సరఫరా ప్రారంభమవుతుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాలు మనుగడలోకి వస్తాయి. ఈ దుకాణాల కాలపరిమితి 2025 డిసెంబర్ వరకు ఉంటుంది.
కేటాయింపులు ఇలా..
ఖమ్మం జిల్లాలోని 4, 116, 101, 18, 66, 2, 77, 94, 17, 62, 110, 41, 109, 114, 67, 92, 7, 1 నంబర్ దుకాణాలు గౌడ కులస్తులకు కేటాయింపు జరిగింది. ఎస్సీలకు 25, 34, 49, 71, 24, 97, 13, 82, 87, 78, 99, 26, 111, 86 నంబర్ దుకాణాల కేటాయింపు జరిగింది. ఎస్టీలకు ఏజెన్సీ ప్రాంతంలోని 117, 118, 119, 120, 121, 122 దుకాణాలు రిజర్వ్ అయ్యాయి. వీటిలో గురువారం లక్కీడ్రా ద్వారా 12, 21 నంబర్ మద్యం దుకాణాలను ఎస్టీలకు కేటాయించినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. భద్రాద్రి జిల్లాలో గౌడ కులస్థులకు 1, 3, 11, 21, 39, 79 నంబర్ దుకాణాలు, ఎస్సీలకు 10, 12, 13, 20, 36, 43, 82 నంబర్ దుకాణాలను కేటాయించినట్లు ప్రియాంక ఆల తెలిపారు. క్రితం కంటే ఈసారి లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీగా ఉంటుందని ఎక్సైజ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రిజర్వేషన్ ఖరారైన దుకాణాల కంటే రిజర్వ్ కానీ దుకాణాలకు అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు.