భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): అట్టహాసంగా జరుపుతామన్న ప్రజాపాలన సంబురాలు భద్రాద్రి జిల్లాలో తుస్సుమన్నాయి. ఖాళీ కుర్చీలతో సభ వెలవెలబోయింది. దీనిని చూసిన జిల్లా కేంద్ర వాసులు.. ‘హవ్వ.. ఇవి సంబురాలా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో శనివారం రాత్రి ప్రజాపాలన వేడుకలు నిర్వహించారు.
అయితే వేదిక మీదున్న కళాకారులకే ఈ సంబురాలు పరిమితమయ్యారు. వందలాది మందికి కుర్చీలు వేస్తే కనీసం 20 మంది కూడా రాలేదు. వచ్చిన ఆ 20 మంది కూడా జనంలేక తిరుగుముఖం పట్టారు. కళాకారులు వారికి వారే పాటలు పాడుకొని వెళ్లిపోయారు. అధికారులు కూడా ఎవరూ రాలేదు. ఒక్క డీపీఆర్వో మాత్రమే హాజరయ్యారు. చివరికి ముఖ్య అతిథి కలెక్టర్ కూడా హాజరుకాకపోవడంతో కళాకారులు అరగంటలోనే వేడుకలను ముగించారు.
తమ సర్కారు కొలువుదీరి ఏడాది అవుతోందంటూ ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొత్తగూడెంలో అట్టహసంగా చేయాలనుకున్నప్పటికీ ప్రజలెవరూ పెద్దగా రాలేదు. హామీల అమల్లో విఫలమైన ప్రభుత్వం పట్ల విసిగిపోయిన జనాలు.. సంబురాలకు ససేమిరా అన్నారు. వేడుకల వద్ద వందలాది కుర్చీలు వేసినప్పటికీ పట్టుమని పదిమంది కూడా రాలేదు.
హామీలు అమలు చేయకపోవడం, రైతు భరోసా ఇవ్వకపోవడం, రుణమాఫీ చేయకపోవడం వంటి కారణాలతో ప్రజల్లో సర్కారుపై విశ్వాసం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ అధికారికం కార్యక్రమాలకు సైతం జనం పెద్దగా రావడం లేదని ఈ సంబురాల ద్వారా అర్థమవుతోంది. మూడు గంటలపాటు జరగాల్సిన సంబురాలు అరగంటలోనే పూర్తి చేయాల్సి వచ్చిందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో 60 మంది కళాకారులు వచ్చారు. ప్రభుత్వ పథకాల గురించి ఆడిపాడాలనుకున్నారు. కానీ జనం రాలేదు. దీంతో ప్రముఖ గాయకుడు, సాంస్కృతిక శాఖ బాధ్యుడు అంతడుపుల నాగరాజు బృంద సభ్యులు నిరుత్సాహంతో వెనుదిరిగారు.