కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 9: అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ అజెండా అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల్లో జరగని అభివృద్ధిని బీఆర్ఎస్ ప్రభుత్వం కొద్దికాలంలోనే చేసి చూపించిందని గుర్తుచేశారు. కొత్తగూడెంలోని 23, 24, 25, 26, 33, 34, 35 వార్డుల్లో శనివారం పర్యటించిన ఆయన.. సుమారు రూ.16 కోట్లతో నిర్మించనున్న కాలువలు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల పాలనలో మురుగునీరంతా రోడ్లపైనే పారేదని, మట్టిరోడ్లే దిక్కయ్యేవని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి వీధిలోనూ సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించిందని వివరించారు.
అలాగే కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, పట్టణ ప్రకృతివనాలు, ఓపెన్ జిమ్ములు, స్టేడియాలు నిర్మిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి వల్లనే అద్భుతమైన పథకాలు అమలవుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో కొత్తగూడెం – పాల్వంచ పట్టణాలను ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు కాపు సీతాలక్ష్మి, వై.శ్రీనివాసరెడ్డి, బాలిశెట్టి సత్యభామ, సాహెరాబేగం, రావి మమత, కాసుల ఉమారాణి, రుక్మాంగధర్ బండారి, అంబుల వేణుగోపాల్, కాసుల వెంకట్, యూసుఫ్, రావి రాంబాబు, నిసార్, బత్తుల శ్రీను, హైమద్, గణేశ్, రవికుమార్, రాము తదితరులు పాల్గొన్నారు. కాగా, వార్డు పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే వనమాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.