కారేపల్లి, ఆగస్టు 29 : సింగరేణి మండల కేంద్రంలో గల పట్టా భూమిలో నరికివేసిన టేకు చెట్లపై అటవీశాఖ టాస్క్ ఫోర్స్ డీఆర్ఓ ఏ.నాగమణి శనివారం విచారణ చేపట్టారు. కారేపల్లి గ్రామానికి చెందిన మన్నేపల్లి జయ తన భూమిలో గల 30 టేకు చెట్లను గుట్టుచప్పుడు కాకుండా కారేపల్లికి చెందిన ఓ కలప వ్యాపారి నరికి వేశాడని జిల్లా ఫారెస్ట్ అధికారికి ఫిర్యాదు చేసింది. అందులో భాగంగా డీఎఫ్ఓ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ డీఆర్ఓ నాగమణి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బి.ఏడుకొండలు, బీట్ ఆఫీసర్ ఆర్.ప్రసాద్, స్థానిక బీట్ ఆఫీసర్ బి.రవి, శ్రీకాంత్ చెట్లు నరికిన ప్రదేశాన్ని పరిశీలించారు. దర్యాప్తు పూర్తి విచారణ నివేదికను డీఎఫ్ఓకు అందజేయనున్నట్లు డీఆర్ఓ తెలిపారు.