ఖమ్మం రూరల్, ఏప్రిల్ 21 : పిల్లలను అతిగా గారాభం చేస్తే పాడైపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని బాలల సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ భారతిరాణి అన్నారు. చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారి సహకారంతో స్కోప్ ఆర్డి సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం రూరల్ మండల పరిదిలోని ఎస్బీఐ రిసోర్స్ ట్రైనింగ్ సెంటర్ నందు తల్లిదండ్రులకు సానుకూల దృక్పథంతో పిల్లల్ని పెంచడం ఎలా అనే అంశంపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఏది అవసరమో, ఏది కోరికో తెలుసుకునేలా పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. వారిలో సానుకూల దృక్పథం పెంపొందించడం ద్వారా పెద్దలను గౌరవించడం, తోటివారితో మర్యాదగా ప్రవర్తించడం, క్రమశిక్షణ, పట్టుదల, ఏదైనా సాధించగలననే నమ్మకాన్ని పెంపొందిస్తుందన్నారు. సంవత్సరం అంతా గారాబం చేస్తూ, బ్రతిమాలుతూ పిల్లల్ని పెంచి పరీక్షల సమయంలో వారిపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఒక్కసారిగా వారిపై ప్రతికూల ప్రభావం పడి పిల్లలు ఆగమవుతున్నారని, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇంటి నుంచి వెళ్లిపోవడం లేదా మానసిక రుగ్మతలకు లోనై జీవిత కాలం తల్లిదండ్రులకు చేదు జ్ఞాపకాలని మిగులుస్తున్నట్లు చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఫోన్ చేసి సహాయం పొందవచ్చు అని తెలిపారు
స్కోప్ ఆర్డి డైరెక్టర్ ఎంఎల్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో పిల్లలకు మొబైల్ ఫోన్ తప్పనిసరైందని, కానీ తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వల్ల పిల్లలు అంతర్జాలంలో లైంగిక వేధింపులకు గురైతున్నట్లు వెల్లడించారు. ప్రతి నిమిషానికి 16 మంది బాలలు ఆన్లైన్లో రకరకాల వేధింపులకు గురవుతున్నారని, దీనిని నిలువరించకుంటే భవిష్యత్‌లో ప్రమాదం నివారించలేని స్థాయికి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున ఈ విషయాన్ని గమనించి తల్లిదండ్రులు వారిని సరైన మార్గంలో నడిపించాలన్నారు.
పోలీస్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బాధ్యులు నరసింహారావు మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా అనేది ఆన్లైన్ ద్వారా కూడా జరుగుతుందన్నారు. పిల్లలు తెలిసి తెలియక రకరకాల వెబ్సైట్లను ఓపెన్ చేయడం వాటిపట్ల ఆకర్షితులవడం తద్వారా వారు అక్రమ రవాణాకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు అయితే వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి సహాయం పొందాలన్నారు. సైబర్ సెల్ కానిస్టేబుల్ నాగేశ్వరావు మాట్లాడుతూ.. పిల్లలు, మహిళలు ఎక్కువగా ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారని, వ్యక్తిగత వివరాలను సాధ్యమైనంత వరకు ఆన్లైన్లో ఉంచకూడదని తెలిపారు. అనవసరమైన లింకులపై క్లిక్ చేయొద్దన్నారు. ఆన్లైన్ మోసం జరిగిన గంటలోపు 1930 నంబర్‌కు ఫోన్ చేస్తే సాధ్యమైనంత వరకు పోగొట్టుకున్న నగదును తిరిగి ఇప్పించడం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ కె.సుజాత, ఎస్బిఐ ఆర్టీసీ డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Khammam Rural : పిల్లలను అతిగా గారాబం చేయొద్దు : సీడబ్ల్యూసీ చైర్పర్సన్ భారతిరాణి