చిన్నతనంలోనే అమ్మానాన్న ప్రేమానురాగాలకు దూరమైన ఆ అక్కాతమ్ముడికి.. ఒకరంటే ఒకరికి అంతులేని ఆపేక్ష. ఆ తమ్ముడు తన అక్కను తండ్రిలాగా బాధ్యతగా చూసుకున్నాడు. ఆ అక్క తన తమ్ముడిని అమ్మలాగా లాలనతో చూసుకుంది. చిన్నప్పటి నుంచి వారిద్దరూ ఒకరికొకరు ‘రక్ష’గా నిలబడ్డారు. ఈ ‘రక్షా’బంధన్‌కు రెండు రోజుల ముందుగానే కలుసుకున్న వారిద్దరూ.. పరస్పరం కంటి నిండా చూసుకోలేకపోయారు, మనసారా మాట్లాడుకోలేకపోయారు. వారిద్దరిలోనూ సంతోషం మాయమైంది, మది నిండా దుఃఖం అలుముకుంది. అక్కతో రాఖీ కట్టించుకోకుండానే ఆ తమ్ముడు భౌతికంగా వె..ళ్లి..పోయాడు. “ఒరేయ్ తమ్ముడూ.. లేవరా..” అంటూ, తన తమ్ముడి చేతిని కన్నీటితో తడుపుతూ ఆ అక్క ‘చివరి’ రాఖీ కట్టింది..!
కూసుమంచి, ఆగస్టు 7: మండలంలోని కిష్టాపురం గ్రామస్తుడైన పందిరి అప్పిరెడ్డి (24) వృత్తిరీత్యా ప్రొైక్లెనర్ ఆపరేటర్. అతడికి నాలుగు రోజుల కిందట జ్వరం సోకింది. బంధువులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. డెంగీ జ్వరంగా వైద్యులు నిర్ధారించారు. అతడు ఆస్పత్రిలోనే బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. అతడికి అక్క జ్యోతి ఉంది. అప్పిరెడ్డి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రికి అనారోగ్యం.
ఈ కారణంగా అతడు తన నానమ్మ వద్దనే పెరిగాడు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు దూరమైన ఆ అక్కాతమ్ముళ్లకు ఒకరంటే ఒకరికి అంతులేని ఆపేక్ష. అతడిని ఆమె తల్లిలా లాలనగా చూసుకుంది. ఆమెను అతడు తండ్రిలా బాధ్యతగా చూసుకున్నాడు. “అక్కా, రాఖీ పండక్కి రా. ఈ మధ్య మనం కలుసుకోక చాలా రోజులైంది. ఈ పండుగ రోజయినా కలుద్దాం. కబుర్లు చెప్పుకుంటూ, కలిసి భోంచేద్దాం” అంటూ, అక్కను ఆహ్వానించాడు ఆ తమ్ముడు. అత్తారింట్లో ఉన్న ఆ అక్క సరేనంది.
ఇంతలోనే, అప్పిరెడ్డికి జ్వరం సోకింది. ఈ విషయం తెలియగానే ఆమె పరుగు పరుగున వచ్చేసరికి అతడు ఆస్పత్రిలో మంచంపై ఉన్నాడు. డెంగీ జ్వరంగా తేలింది. పరిస్థితి విషమించింది. ఆమె మనసు కీడును శంకించింది. ఉబికొస్తున్న కన్నీటిని దిగమింగుతూ.. బుధవారం మధ్యాహ్నం బయటకు వెళ్లి రాఖీ తీసుకొచ్చింది. ఆమె వచ్చేసరికే తమ్ముడు అప్పిరెడ్డి.. కన్ను మూశాడు. ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. కిష్టాపురంలో గురువారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడు.. “ఒరేయ్ తమ్ముడూ.. రాఖీ కట్టడానికి వచ్చాను.. లేవరా..?” అంటూ, అతడి చేతిని పైకెత్తి, తన కన్నీటితో తడిపింది. ఆ చేతికి ‘చివరి’ రాఖీ కట్టింది. ఆ తర్వాత, సోదరి వరసైన పిట్టా సౌజన్య, పిట్టా కృష్ణవేణి, హేమలత, భవాని.. కన్నీటిపర్యంతమవుతూ అప్పిరెడ్డి చేతికి ‘చివరిసారి’ రాఖీలు కట్టారు. ఈ దృశ్యం.. చూపరులకు కన్నీరు తెప్పించింది.