కొత్తగూడెం, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : గ్రామపంచాయతీ ఎన్నికల కోసం జిల్లా అధికారులు ముసాయిదాను సిద్ధం చేశారు. డీపీవో రాజమౌళి ఆధ్వర్యంలో ఓటర్ల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను అధికారులు పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో గోడలపై శుక్రవారం ప్రదర్శించారు. ఈ నెల 14 నుంచి 21 వరకు అభ్యంతరాల స్వీకరణ, 26న అభ్యంతరాల పరిశీలన తర్వాత తుది జాబితాను రూపొందించి.. 28న ఫైనల్ పబ్లికేషన్ విడుదల చేయనున్నారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో కార్యదర్శుల వద్ద ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచారు.
నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా జిల్లాలో అదనంగా కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గత పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. తర్వాత భద్రాచలం, సారపాక పంచాయతీలను అదనంగా ఐదు పంచాయతీలుగా చేసిన విషయం విదితమే. అయితే ఎన్నికల నిర్వహణకు ఇప్పటి వరకు అనుమతి రాలేదు. అయినా వాటితో కలిపి పంచాయతీ అధికారులు వార్డుల విభజన చేశారు. 484 పంచాయతీలకు.. 4,314 వార్డులుగా విభజించారు. రాబోయే ఎన్నికలు భద్రాచలం, సారపాకలో పెరిగిన పంచాయతీలకు కూడా నిర్వహించనున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారు చేశారు. జిల్లాలో 22 మండలాలకు 484 పంచాయతీల్లో 4,314 వార్డులలో 6,82,858 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో మహిళలు 3,49,893, పురుషులు 3,32,940 మంది, ఇతరులు 25 మంది ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.