HomeKhammamDisabled People Staged A Protest Alleging Injustice In The Selection Of Beneficiaries
257 దరఖాస్తులు.. ముగ్గురి ఎంపిక!
లబ్ధిదారుల ఎంపిక విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఉపాధి కల్పన కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు దివ్యాంగులు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. ఈ ఘటన బోనకల్లు మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.
ఉపాధి కల్పన విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని తీవ్ర ఆవేదన
బోనకల్లు, మార్చి 25 : లబ్ధిదారుల ఎంపిక విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఉపాధి కల్పన కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు దివ్యాంగులు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. ఈ ఘటన బోనకల్లు మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల ఉపాధి కల్పన కోసం ఆర్థిక పునరావాస పథకం కింద అర్హులైన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించింది. మండలవ్యాప్తంగా 257 మంది దరఖాస్తు చేసుకోగా.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో రమాదేవి, కన్వీనర్ బాలాత్రిపుర సుందరి లాటరీ ద్వారా చేపట్టారు.
ముగ్గురిని ఎంపిక చేసినట్లు ప్రకటించిన అధికారులు వారి వివరాలను జిల్లా అధికారులకు పంపిస్తామని, ఇందులో ఒకరికి మాత్రమే ఉపాధి కోసం రూ.50 వేలు మంజూరు చేస్తారని పేర్కొన్నారు. అక్కడే ఉన్న దివ్యాంగులు 257 మంది దరఖాస్తు చేసుకుంటే .. ముగ్గురిని మాత్రమే ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నించగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. దీంతో దివ్యాంగులమైన తమను కూడా ప్రభుత్వం అన్ని విధాల మోసం చేసిందని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ బోనకల్లు-ఖమ్మం ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.
దీంతో ట్రాఫిక్ స్తంభించడంతోపాటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దివ్యాంగులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ప్రభుత్వం దివ్యాంగుల పట్ల నిర్లక్ష్య ధోరణి వీడి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒకరికి రుణాలు మంజూరు చేయాలని కోరారు. కాగా.. దివ్యాంగులకు సీపీఎం మండల కార్యదర్శి కిలారి సురేశ్, తెల్లాకుల శ్రీనివాసరావు, గుగులోతు నరేశ్ సంఘీభావం తెలిపారు. దివ్యాంగుల సమస్యల పరిషారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని చెప్పారు.