భద్రాచలం, మార్చి7 : భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో హోలీ పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం డోలోత్సవం, వసంతోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం అంతరాలయంలోని మూలవరులు, ఉత్సవ పెరుమాళ్లకు పంచామృతాలు, సహస్రధారలతో స్నపన తిరుమంజనం జరిపారు. అందంగా అలంకరించిన బంగారు ఊయలలో స్వామివారి ఉత్సవ మూర్తులను ఉంచి, ఆస్థాన హరిదాసులు భక్త రామదాసు, తూము నర్సింహాదాసు కీర్తనలను ఆలపిస్తుండగా.. స్వామివారికి వివిధ రకాల హారతులను సమర్పించారు. అనంతరం డోలోత్సవంలో భాగంగా రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోలీ పౌర్ణమి రోజు స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించడం భక్తరామదాసు కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఆ రోజున రామచంద్రులవారికి వసంతం చల్లి, పెళ్లికొడుకుగా అలంకరించినట్లు భావిస్తారు. వసంత పంచమిరోజు స్వామివారిని పెళ్లి కుమారుడిగా అలంకరిస్తారు. అంతరాలయంలోని మూలమూర్తులకు, లక్ష్మితాయారమ్మకు, ఆంజనేయ స్వామివారికి వసంతాన్ని ప్రోక్షించి, తదుపరి భక్తులకు వసంతాన్ని చల్లారు.
కల్యాణ తలంబ్రాల తయారీ, పసుపు దంచే వేడుక శ్రీరామ నవమి రోజున సీతారాముల కల్యాణంలో వినియోగించే కల్యాణ తలంబ్రాలను కలిపే వేడుకను మిథిలా ప్రాంగణంలో నిర్వహించారు. ముందుగా ఉత్తర ద్వార దర్శనం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏడాది పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం రావడంతో నదుల నుంచి, సముద్రాల నుంచి పుణ్య జలాలను తీసుకొని వచ్చేందుకు పూజలు చేశారు. తదుపరి వైష్ణవ ముత్తైదువులచే పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధానార్చకులు గోటి తలంబ్రాలపై పవిత్ర పుణ్య జలాలను ప్రోక్షించి, రోలు, రోకలిలో లక్ష్మి, సరస్వతులను ఆవాహన చేసి, రోకలికి కంకణధారణ చేశారు. తొమ్మదిమంది వైష్ణవ ముైతైదువులచే పసుపు దంచే వేడుకను నిర్వహించారు. అలా కొట్టిన పసుపు, కుంకుమలతోపాటు అనంతరం తలంబ్రాలను, పసుపు, కుంకుమ, ఆవునెయ్యి, బుక్కా గులాలు, అత్తరు, పన్నీరు, లావెండర్ తదితర సుగంధ ద్రవ్యాలతో తలంబ్రాలను తయారు చేశారు. అక్కడ నుంచి స్వామివారిని ప్రత్యేక పల్లకీలో ఆలయ ప్రాంగణంలోకి తీసుకొని వెళ్లారు. మిథిలా ప్రాంగణంలో కల్యాణ తలంబ్రాలను భక్తులచే కలిపించారు. ప్రతిఏటా చిత్రకూట మండపంలో జరిగే ఈ వేడుకను ఈ సారి ఉత్తర ద్వార దర్శనం వద్ద, మిథిలా ప్రాంగణంలో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలొచ్చి కల్యాణ తలంబ్రాల తయారీలో పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆలయ ఏఈవోలు శ్రావణ్‌కుమార్, భవానీరామకృష్ణ, భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి ముద్దసాని నీలిమ, ఆలయ ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, పొడిచేటి సీతారామానుజాచార్యులు, రాజా, గోపాలకృష్ణమచార్యులు, అమరవాది రామానుజాచార్యులు, మురళీ కృష్ణమాచార్యులు, వేద పండితులు సన్యాసిశర్మ పాల్గొన్నారు.
భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. ఆనాడు తానీషా మహా ప్రభువు రామయ్యకు బుక్కా గులాలు, అత్తరు, ఆవునెయ్యి, తదితర సుగ్రంధ ద్రవ్యాలతో కలిపిన తలంబ్రాలను పంపించేవారు. ఆ తలంబ్రాలు ఎరుపు రంగులో ఉండేవి. అప్పటి నుంచి వివిధ రకాల సుగ్రంధ ద్రవ్యాలతో తయారు చేసిన తలంబ్రాలను మాత్రమే స్వామివారి కల్యాణంలో వినియోగిస్తున్నారు. వాటిలో ముత్యాలు పోసి, ముత్యాల తలంబ్రాలుగా ఆలయంలో విక్రయిస్తున్నారు. నిత్య కల్యాణంలో మాత్రమే పసుపు తలంబ్రాలను వినియోగిస్తారు. కోరుకొండ, అశ్వాపురం, మణుగూరు, కొత్తగూడెం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోటితో ఒలిచిన వడ్లను ఆలయ అర్చకులకు అందజేశారు.
ఈ నెల 29న రామయ్యకు ఎదుర్కోలు ఉత్సవం, 30న మిథిలా ప్రాంగణంలో ఉన్న కల్యాణ మండపంలో శ్రీరామ నవమి, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పర్ణశాల, మార్చి 7 : పర్ణశాల ఆలయంలో డోలో ఉత్సవం సందర్భంగా ఘనంగా వసంత వేడుక జరిగింది. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. ప్రాంగణంలో పదిమంది ముత్తయిదువులతో రోకలితో పసుపు కొమ్ముయలను దంచి అటువంటి పసుపు చూర్ణాన్ని మూలవిరాట్లకు, ఉత్సవ మూర్తులకు సమర్పించి హోలీ సందర్భంగా వసంత వేడుక ఎంతో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేసి నూతన పట్టు వస్ర్తాలతో రాములవారిని ఆలంకరించారు. అనంతరం స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేశారు. నూతన పట్టు వస్ర్తాలతో రాములవారిని అలంకరించారు. అనంతరం రాములవారి కల్యాణంలో ముఖ్యభాగమైన తలంబ్రాలు ముత్తయిదువుల చేతుల మీదుగా కలపడం జరిగింది. హోలీ సందర్షభంగా పర్ణశాల ఆలయంలో వేడుకలు జరిగాయి. మహిళలు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయంత్రం తిరువీది సేవ, విశేష ప్రసాద నివేదన జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు శేష కిరణ్‌కుమారాచార్యులు, భార్గవాచార్యులు, సూపరింటెండెంట్ కిశోర్, సిబ్బంది రాము, శివ పాల్గొన్నారు.