ఖమ్మం, జూన్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆగస్టు 15 నాటికి ఏన్కూరు లింక్ కెనాల్‌ను పూర్తి చేసి 1.20 లక్షల ఎకరాలకు గోదావరి నుంచి సాగునీటిని అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో 1, 2, 3 ప్యాకేజీల పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సాగునీరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి భద్రాద్రి జిల్లాలో గురువారం పర్యటించారు. తొలుత అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద ఉన్న సీతారామ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులను పరిశీలించారు. తర్వాత ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద మూడో పంపుహౌజ్ పురోగతి గురించి అధికారులతో సమీక్షించారు.
‘ఇప్పటి వరకు జరిగిన పనులు, కొనసాగుతున్న పనులు, భూ సేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావాల్సిన నిధులు, ఎదురవుతున్న సమస్యలు’ వంటి అంశాల గురించి ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలు చేశామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసే విషయం గురించి కూడా సమీక్షించామన్నారు. 9 కిలోమీటర్లు ఉన్న ఏన్కూరు లింక్ కెనాల్‌ను పూర్తి చేయడానికి రూ.72 కోట్లు మంజూరు చేశామన్నారు. పంపుల ట్రయల్ రన్‌కు పవర్ సప్లయి కోసం నిధులు ఇచ్చామన్నారు. ఏన్కూరు లింకు కాలువకు రాజీవ్ కెనాల్‌గా నామకరణం చేసినట్లు చెప్పారు. సీతారామ పంపుహౌస్‌ల 1, 2, 3 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులు తొందరలోనే మొదలవుతాయని వెల్లడించారు.
తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సాగునీరు ఇవ్వడానికి ఇరగేషన్ శాఖ ప్రణాళికను తయారు చేసుకొని ముందుకెళ్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీతారామ ప్రాజెక్టులో అనుసంధానంగా ఉన్న ఏన్కూరు కాలువకు ఇప్పటికే నిధులు మంజూరు చేశామన్నారు. ఆ కాలువకు రాజీవ్ కెనాల్‌గా పేరు పెట్టినట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గాలకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మం త్రులు తుమ్మల, పొంగులేటి మాట్లాడుతూ.. 1998లోనే దుమ్ముగూడెం పేరుతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగినట్లు చెప్పారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతోనే ఇప్పటి సీతారామ ప్రాజెక్టుకు పునాదులు పడ్డాయన్నారు. ఈ వర్షాకాలంలోనే రైతులకు ఉపయోగపడేలా సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. ఎంపీలు రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, కలెక్టర్ ప్రియాంక, అదనపు కలెక్టర్లు విద్యాచందన, వేణుగోపాల్, ఇరిగేషన్ శాఖ అధికారులు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.