ఖమ్మం/ కూసుమంచి (నేలకొండపల్లి)/ పాల్వంచ రూరల్/ వైరా టౌన్, ఆగస్టు 12: తెలంగాణ రాష్ర్టాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి ప్రపంచపటంలో స్థానం కల్పిస్తామని, ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఖిల్లాని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ పర్యాటకరంగం అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయిస్తామన్నారు.
ఖమ్మం జిల్లాకేంద్రంలో ఖిల్లాకు రోప్‌వే కావాలన్న డిమాండ్ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందన్నారు. రోప్ వే నిర్మాణానికి అనుమతులు ఇస్తూ మంత్రి జూపల్లి సంతకాలు చేశారని, త్వరలోనే పనులు ప్రారంభించి కొద్దినెలల్లోనే అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఖమ్మం ఖిల్లా వెయ్యేండ్ల చరిత్ర గల చారిత్రక కట్టడమని అన్నారు. రోప్ వే వేస్తే తప్ప ఖిల్లాలో విహారానికి అవకాశం లేదన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ అంతర్జాతీయ పర్యాటకులను రాష్ర్టానికి రప్పించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఉమ్మడి ఖమ్మంజిల్లాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఖమ్మంఖిల్లాపై ఒక కిలోమీటరు మేర సుమారు రూ.30 కోట్లతో రోప్ వే నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. అంతకుముందు మంత్రులు నేలకొండపల్లి మండలం మజ్జుగూడెం గ్రామంలోని బౌద్ధ స్తూపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, గృహనిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బౌద్ధస్తూపం 1వ శతాబ్దంలోనిదని, 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దీన్ని అభివృద్ధి చేస్తే గొప్ప పర్యాటకప్రాంతంగా మారుతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ రమేశ్‌రెడ్డి, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ అభిషేక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా టూరిజం అధికారులు పాల్గొన్నారు.
అదేవిధంగా పాల్వంచ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కిన్నెరసానిని మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించారు. రిజర్వాయర్‌లో ప్రత్యేక బోటులో విహరించి కిన్నెరసాని అందాలను తిలకించారు. బోటింగ్ పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేశ్, ఐటీడీఏ పీవో రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజు తదితరులు పాల్గొన్నారు. వైరా రిజర్వాయర్‌ను కూడా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి సోమవారం రాత్రి సందర్శించారు. పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని తెలిపారు.