ఖమ్మం సిటీ, నవంబర్ 15: 68వ రాష్ట్రస్థాయి అండర్-14 బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డీఈవో సోమశేఖర శర్మ, డీవైఎస్వో తుంబూరి సునీల్‌రెడ్డి, ప్రముఖ పిల్లల వైద్య నిఫుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్, విద్యావేత్త రవిమారుత్, డి.ప్రసాద్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. పోటీలకు ఉమ్మడి పది జిల్లాల నుంచి దాదాపు 320 మంది క్రీడాకారులు హాజరయ్యారు. మొదటి రోజు 600 మీటర్ల పరుగు పందెం, షాట్‌ఫుట్, లాంగ్ జంప్ అంశాల్లో పోటీలు నిర్వహించగా.. క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రతిభను ప్రదర్శించారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నరసింహమూర్తి, షఫిక్ ఈ పోటీలను పర్యవేక్షించారు.
బాలుర 600 మీటర్ల పరుగు పందెంలో కే జాకేష్ (ఆదిలాబాద్), కే లవ్లిత్, ఎం.చరణ్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో ఎం.రాజేశ్వరి (వరంగల్), ఎండీ సమీరా (కరీంనగర్), టి.పల్లవి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలుర షాట్‌పుట్ విభాగంలో జే సాత్విక్ (ఆదిలాబాద్), బీ నరేశ్ (ఖమ్మం), ఎస్.వంశీ (మహబూబ్‌నగర్), బాలికల లాంగ్‌జంప్ విభాగంలో అన్విత (రంగారెడ్డి), వై శృతిహాసన్ (ఖమ్మం), టీఎస్ ధన్యశ్రీ (హైదరాబాద్) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.