కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 29 : భూ క్రయవిక్రయాల్లో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన స్లాట్ విధానాన్ని రద్దు చేసి.. పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుతూ స్లాట్ బుకింగ్ విధానంలో స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఏదైనా సమస్యతో ఆరోజు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మరోసారి స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు.
సర్వర్ డౌన్‌తో రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా తగ్గిపోతుందని, ప్రభుత్వం ఆదాయం కోల్పోవడంతోపాటు తాము కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో రిజిస్ట్రేషన్ ఏరియాలుగా ఉన్న పాల్వంచ, పాత కొత్తగూడెం, సుజాతనగర్, అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఇంటి అసెస్మెంట్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని, ఏజెన్సీ ఆధారిత పార్టీషన్ డీడీలను నమోదు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జావీద్, అన్వర్, శ్రీకాంత్, సుధాకర్, రాజు, దావూద్, అహ్మద్, చిన్ని, శ్రీను, జీవన్, సారథి తదితరులు పాల్గొన్నారు.