కూసుమంచి(నేలకొండపల్లి), జూన్ 20 : ఆధునిక పద్ధతిలో సాగు చేయడం వల్ల మంచి లాభాలు ఉంటాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(డీఏవో) విజయనిర్మల అన్నారు. నేలకొండపల్లిలోని వాసవీ భవన్లో భక్తరామదాసు సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలు చేయించుకున్న తర్వాతే పంటలు సాగు చేయాలని కోరారు. భూమిని సారవంతం చేయడానికి పశువుల ఎరువును సాగు భూముల్లో చల్లాలని, మంచి దిగుబడుల కోసం మేలైన విత్తనాలను ఎంచుకోవాలన్నారు.
రైతులు ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో కొనుగోలు చేస్తున్న వాటికి తప్పక రసీదులు తీసుకోవాలని సూచించారు. ఉద్యానవన పంటలు, ఎరువుల మోతాదు, కీటకాల బారి నుంచి రక్షించుకునే విధానంపైన జిల్లా అధికారి రమణ, మధిర వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు రుక్మిణీదేవి, కీటక శాస్త్ర నిపుణులు డాక్టర్ నాగస్వాతి, ఏడీఏ విజయ్‌చంద్ర వివరించారు. అనంతరం సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు పొన్నగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. సదస్సులో జిల్లా రైతు బాధ్యులు నల్లమల వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారి అరుణ, మదాఖాన్ కేన్ అధికారి అప్పారావు, సొసైటీ కార్యదర్శి లింగస్వామి, కోశాధికారి దండా రవీంద్రబాబు, రైతు కమిటీ బాధ్యులు మచ్చా రఘుపతి, ఎలమద్ది లెనిన్, గణపతిరావు, వెల్లపల్లి శ్రీనివాసరావు, నెల్లూరి వీరబాబు, భాస్కర్‌రావు, వెంకటాచారి, తిరుపతయ్య, లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.