పాల్వంచ/టేకులపల్లి, మే 22 : మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు మరో 26 మంది మావోయిస్టుల బూటకపు ఎన్‌కౌంటర్‌ను సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు పాల్వంచ నటరాజ్ సెంటర్ వద్ద, టేకులపల్లి మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల జెండాలతో గురువారం నిరసన తెలిపారు. బూటకపు ఎన్కౌంటర్లో మృతిచెందిన అమరవీరులకు సంతాపం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎన్డీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, టేకులపల్లి మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు డి.ప్రసాద్ మాట్లాడుతూ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రశ్నించే గొంతుకలు ఎందుకు ఉంటాయో ఈ పాలకులకు అర్థం కావడం లేదా? అని వారు ప్రశ్నించారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని లేఖలు విడుదల చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు.
మావోయిస్టులకు మద్దతుగా ప్రజలు, ఆదివాసీలు, ప్రజాస్వామిక వాదులు, అన్ని పార్టీల శ్రేణులు ఉద్యమాలకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. తక్షణమే ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, మహేశ్, నాగేశ్, లక్ష్మి, సుగుణ, ఏఐకేఎంఎస్ నాయకులు ఎట్టి నరసింహారావు, నోముల భానుచందర్, శంకర్, భూక్యా నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన
ఇల్లెందు, మే 22 : బూటకపు ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ పలు ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఇల్లెందు కొత్త బస్టాండ్ సెంటర్లో కుమ్రం భీం విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ఫ్రంట్, ఆదివాసీ ప్రజా సంఘాలు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ప్రజాపంథా నాయకులు రామటెంకి అశోక్, మెంతెన సంజీవరావు, రమణాల లక్ష్మయ్య, సారంగపాణి, కాంపాటి పృథ్వీ, చైతన్య, కొప్పుల గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.