కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాల్లో సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, కార్మిక సంఘాల జేఏసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీసు, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసనలు, ధర్నాలు, ప్రతుల దహనాలు చేశారు.
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్న అధ్యక్షతన కొత్తగూడెం సింగణేణి హెడ్డాఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు, ఐఎన్టీయూసీ నాయకులు త్యాగరాజ్, జలీల్, ఇఫ్టూ నుంచి సతీశ్‌లు పాల్గొని మాట్లాడారు. సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఆపాలని, బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని మోదీ సర్కార్ యథేచ్ఛగా నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మిక హక్కులను కాలరాస్తున్నదని, యావత్ కార్మిక లోకం, సంఘాలు ఐక్య పోరాటాలు చేయకపోతే ఈ విధానాలను తిప్పికొట్టడం సాధ్యం కాదన్నారు. జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సూరం ఐలయ్య, రమణ, భాస్కర్, లక్ష్మి, సంజు, జాటోత్ కృష్ణ, చంద్రశేఖర్, కాలం నాగభూషణం, ఆల్బర్ట్, యాకూబ్ పాల్గొన్నారు.