భద్రాచలం, నవంబర్ 3: గుండాలపాడు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, ప్రజాపంథా ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ ఎదుట నాయకులు, కార్యకర్తలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు నూప భాస్కర్, కిశోర్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామానికి 2023లో బీటీ రోడ్డు మంజూరు చేసినప్పటికీ అధికారులు నిర్మాణం పూర్తి చేయడం లేదని మండిపడ్డారు.
ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఆదివాసీ గ్రామాలు అభివృద్ధి చెందడం లేదని, ఎమ్మెల్యే వివిధ కార్యక్రమాలకు వెళ్లినప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఆదివాసీ గ్రామాల్లో నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నూప సరోజిని, కొర్సా రామకృష్ణ, కారం వెంకటేశ్వర్లు, పోడియం రవి, సున్నం శంకర్, సోయం రాము, మడివి సునీల్, పుష్ప, కురుసం ముఖేశ్ పాల్గొన్నారు.