ఖమ్మం/ ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 13: ‘సీఎం సారూ.. మా స్కూటీలు ఏమయ్యాయి?’ అంటూ ఖమ్మంలోని డిగ్రీ కళాశాలల విద్యార్థినులు సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయినా స్కూటీల హామీని అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలో గురువారం పోస్టుకార్డు ఉద్యమం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారూ.. 18 ఏళ్లు పైబడిన యువతులకు ఉచితంగా స్కూటీలు ఇస్తామంటూ చేసిన వాగ్దానం ఏమైంది సారూ?’ అంటూ ప్రశ్నించారు. ‘మీరిచ్చిన స్కూటీల హామీని మర్చిపోయారేమోనని అనుకుంటున్నాం. అందుకే దానిని గుర్తుచేస్తూ పోస్టుకార్డులు పంపుతున్నాం సార్..’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన ఆ పోస్టుకార్డుల్లో పేర్కొన్నారు.
ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల విద్యార్థినులు, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినులు, ఇతర ప్రైవేటు డిగ్రీ కళాశాలల విద్యార్థులు కలిసి ఖమ్మం నగరంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ‘ముఖ్యమంత్రి గారూ.. మేం ఖమ్మంలోని డిగ్రీ విద్యార్థినులం. ఖమ్మం నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి డిగ్రీ చదువుకునేందుకు ప్రతి రోజూ కళాశాలలకు వచ్చి వెళ్తున్నాం. ఇలా ప్రతిరోజూ బస్సుల్లోనూ, ఆటోల్లోనూ రాకపోకలు సాగించే క్రమంలో అనేక ఇబ్బందులు పడుతున్నాం. మీరు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటికీ మా మార్గాల్లో బస్సులు ప్రయాణించడం లేదు. బస్సు సౌకర్యం ఉన్న మార్గాల్లో మా కళాశాలల సమయాలకు అనుగుణంగా అవి రావడం లేదు. ఒకవేళ వేచి చూసినా బస్సులన్నీ నిండిపోయి ఉంటున్నాయి. కనీసం ఎక్కేందుకు కూడా చోటు ఉండడం లేదు.
ఇక ఆటోల్లో వెళ్లి వచ్చేంత ఆర్థిక వెసులుబాటు కూడా మాకు లేదు. మీరిచ్చిన స్కూటీల హామీపై మేం ఎంతో నమ్మకంతో, ఆశతో ఉన్నాము. మీరు స్కూటీలిస్తే సమయానుకూలంగా కళాశాలలకు వెళ్లి రావొచ్చని, మా భవిష్యత్తుకు పునాదులు వేసుకోవచ్చని కలలుగన్నాం. కానీ.. 15 నెలలు గడిచినా మీరు స్కూటీలు ఇవ్వడం లేదు. ఇంతలో మా ఒక ఏడాది విద్యాభ్యాసం కూడా ముగిసింది. ఇప్పుడు మరో ఏడాది తరగతులకు వెళ్తున్నాం. ఇప్పటికైనా మా ఇబ్బందులను గమనించండి. మీ స్కూటీల హామీని అమలు చేయండి. మాకు బంగారు భవిష్యత్తును అందించండి’ అంటూ పోస్టు కార్డులు రాశారు. వాటిని పోస్టుబాక్సుల్లో వేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. 15 నెలలుగా స్కూటీల కోసం ఎదురుచూస్తున్నామని, స్కూటీల హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నామని డిమాండ్ చేశారు.