బోనకల్లు, ఆగస్టు 02 : వ్యవసాయ కూలీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ, పొన్నం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం బోనకల్లు మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభ జరిగింది. ఈ మహాసభకు కారంగుల చంద్రయ్య, దూబ భద్రాచలం అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. మహాసభలో వారు మాట్లాడుతూ.. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ కూలీలకు రోజువారి కూలీ రూ.400 అమలు చేసే విధంగా చట్టాన్ని తీసుకురావాలన్నారు.
ఉపాధి హామీ పథకానికి కేంద్రం ప్రతి ఏడాది నిధులు తగ్గిస్తూ మొత్తంగా పథకాన్ని లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పొట్ట కొట్టి పెట్టుబడిదారుల జేబులు నింపడమే మోదీ ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతుందన్నారు. హక్కుల సాధన కోసం వ్యవసాయ కూలీలు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీనివాసరావు, వత్సవాయి జానకి రాములు, గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు చింతలచెరువు కోటేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ నాయకులు కిలారి సురేశ్, వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి బంధం శ్రీనివాసరావు, దోబ భద్రాచలం, రాష్ట్ర నాయకురాలు బంధం వెంకటరాజ్యం పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా తెల్లాకుల శ్రీనివాసరావు, కార్యదర్శిగా బంధం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా కర్లకుంట మత్తయ్య, సహాయ కార్యదర్శిగా పిక్కెల సీతారాములుతో పాటు మరో 16 మందిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.