– జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 03 : ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాలను విస్మరించిందని మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ తీవ్రంగా విమర్శించారు. రైతు సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 2 నుండి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఎర్రుపాలెం మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మామునూరులో భారీ రైతు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో ర్యాలీగా తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూడూరు రమణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో కమల్‌రాజ్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరు హామీల కార్డును ప్రజలకు అందించి, దానిని భద్రంగా దాచుకోవాలని చెప్పారన్నారు. రూ.100 స్టాంప్ పేపర్‌పై హామీలు రాసి ఇస్తామని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హామీలను అమలు చేయకపోవడంతో ఆ హామీ కార్డు ఇప్పుడు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’గా మారిందని ఎద్దేవా చేశారు.

‘బాకీ కార్డుగా కాంగ్రెస్ హామీల కార్డు’
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ ఉందో బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ప్రతి కాంగ్రెస్ నాయకుడిని హామీల అమలుపై నిలదీసి.. ప్రజలకు రావాల్సిన బాకీని అడిగి వసూలు చేసుకునేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. పుట్టిన బిడ్డకు అందాల్సిన కేసీఆర్ కిట్ నుంచి విద్యార్థులకు ఫీజు కార్డులు, యువతులకు స్కూటీలు, వివాహమైన మహిళలకు రూ.1.16 లక్షలకు అదనంగా తులం బంగారం, ఆసరా పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీలు ఇచ్చిందని పేర్కొన్నారు. రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.15 వేలు, ఆటో కార్మికులకు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను సైతం ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధిగా స్థానిక ఎమ్మెల్యే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని కమల్‌రాజ్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులకు ఇప్పుడు కొత్త రంగులు అద్దుతూ తమ ఖాతాలో వేసుకోవడం తప్ప.. కొత్తగా ప్రజలకు కనిపించే అభివృద్ధి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పుట్టిన బిడ్డ నుంచి పండు వృద్ధుల వరకు.. విద్యార్థుల నుంచి రైతులు, రైతు కూలీలు, ఆటో కార్మికుల వరకు ప్రతి వర్గానికి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వాటి అమలును విస్మరించిందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన ప్రభుత్వం.. హామీలను పక్కనపెట్టి కాలయాపన చేయడం దారుణమన్నారు.

‘బాకీ కార్డుగా కాంగ్రెస్ హామీల కార్డు’
వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నేటికి వెయ్యి రోజులు పూర్తయినా హామీల అమలు పూర్తిస్థాయిలో జరగలేదని విమర్శించారు. ఇన్ని రోజులు గడిచినా కొత్త మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. “ఇక ప్రజలను మోసం చేయడం సాధ్యం కాదు.. మీ పప్పులు ఉడకవు” అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి అండగా బీఆర్ఎస్ నిలుస్తుందని, ప్రభుత్వం స్పందించే వరకు ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని కమల్‌రాజ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శీలం కవిత, మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, సర్పంచులు శీలం రామకోటారెడ్డి, వేల్పుల బెంజిమెన్, కొల్లు శ్రీనివాసరావు, మండల నాయకులు శీలం నారాయణరెడ్డి, గూడూరు రమణారెడ్డి, శేగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కుడుముల మల్లికార్జున రెడ్డి, బొర్ర నరసింహారావు, యరమల కృష్ణారెడ్డి, కోట శ్రీనివాసరావు, సంక్రాంతి కృష్ణారావు, షేక్ బహదూర్ ఖాన్, బ్రహ్మానందరెడ్డి, వెంకటనర్సిరెడ్డి, తిరుపతిరావు, గద్దల శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, కాళేశ్వరావు, రవి, సీతారామిరెడ్డి, పూర్ణారెడ్డి, మల్లారపు బాలాజీ, వెంకటేశ్వరావు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.