ఖమ్మం సిటీ, ఏప్రిల్ 5 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నిరుపేద రోగులకు పెద్ద దిక్కుగా ఉన్న ఖమ్మం ‘పెద్దాసుపత్రి’.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కష్టాల్లో పడింది. ఆహ్లాదకరమైన వాతావరణం, క్యాథ్లాబ్, డయాలసిస్, మాతా శిశు సంరక్షణ కేంద్రం, తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ వంటి ఎన్నో అద్భుత సేవలతో నాడు అభాగ్యులను అక్కున చేర్చుకున్న జిల్లా ప్రభుత్వాసుపత్రి.. నేడు అడుగడుగునా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది.
ఎమర్జెన్సీ వైద్యసేవలు, కొవిడ్ వంటి మహమ్మారి నుంచి వందలాది ప్రాణాలకు రక్షణ కవచంలా మారిన ఈ ధర్మాసుపత్రి.. ప్రస్తుత సర్కారు హయాంలో విలవిల్లాడుతోంది. రెండేళ్ల నుంచి హెచ్‌డీఎస్ నిధులు నయాపైసా విడుదల చేయని కారణంగా కనీసం మందు గోళీలు కూడా లభ్యం కాని దుస్థితి. మోకీలు మార్పిడి మెటీరియల్ ఇప్పటికే నిలిచిపోయింది. పలు రకాల సర్జికల్స్, ఆక్సిజన్, గుండెకు స్టంట్ల కోసం చేస్తున్న అప్పులు గుదిబండలా మారాయి.
రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలు చెల్లించాలంటూ వైద్యాధికారులపై ఏజెన్సీలు ఒత్తిడి తెస్తున్నాయి. చివరికి ప్రింటింగ్, స్టేషనరీ బిల్లులకు సైతం దిక్కులేకుండా పోయింది. అడిగిన ప్రతిసారీ ‘హస్తం’ ప్రభుత్వం రిక్తహస్తం చూపిస్తోంది. దీంతో అందుబాటులో ఉన్న వనరులతోనే వైద్యులు నెట్టుకొస్తున్నారు. తొమ్మిదిన్నరేళ్లపాటు ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు దీనస్థితికి దిగజారిన ఖమ్మం జిల్లా సార్వజనీన ఆసుపత్రి గురించి ప్రత్యేక కథనం.
గత బీఆర్ఎస్ పాలనలో ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి కార్పొరేట్‌ను తలదన్నే రీతిలో అనేక విభాగాలను తన ఒడిలో నింపుకొని నిరుపేద రోగులకు అద్భుతమైన వైద్యసేవలందించింది. కానీ, మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం రెండేళ్లలో దవాఖానను అధఃపాతాళానికి నెట్టివేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం కాగితాలు, పెన్నులు (స్టేషనరీ) కొనుక్కునేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వలేక వైద్య యంత్రాంగం దిక్కులు చూస్తోంది.
రెండు దఫాలు కాయకల్ప అవార్డులు సాధించి, పలుమార్లు జాతీయ ఉత్తమ ఆసుపత్రిగా పేరు గడించిన ఈ పెద్దాసుపత్రి.. కేవలం ఈ రెండేళ్ల కాలంలో పుట్టెడు కష్టాల్లో కూరుకుపోవడం విస్మయానికి గురిచేస్తోంది. సరిపడా సిబ్బంది లేరు. రోగులకు మౌలిక వసతుల కల్పనకు, మందుల కొనుగోలుకు, క్యాథ్లాబ్, సర్జికల్స్, ఆర్థో, పీడియాట్రిక్స్ వంటి ఇతర కీలకమైన విభాగాల నిర్వహణకు నిధుల్లేవు. ఏదైనా ఎమర్జెన్సీ సేవలకు సంబంధించిన మిషనరీ ఆగిపోతే మరమ్మతులు చేయించలేని దుస్థితి. స్థానిక వైద్యాధికారులు డీఎంఈకి నివేదిస్తే, హైదరాబాద్ నుంచి టెక్నీషియన్స్ వస్తే తప్ప అడుగు ముందుకు పడని దయనీయ స్థితి.

విద్య, వైద్యరంగాలకు భారీగా నిధులంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా దవాఖాన అభివృద్ధి, రోగుల సేవలకు వినియోగించాల్సిన హెచ్‌డీఎస్ నిధులను నిలిపివేయడం ప్రతిఒక్కరినీ విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు అందకపోవడంతో దవాఖానలో మనస్ఫూర్తిగా విధులు నిర్వర్తించలేక వైద్యులు సతమతమవుతున్నారు.
ఇప్పటికే ఆక్సీజన్ సరఫరా ఏజెన్సీకి సుమారు రూ.2 కోట్లు, సర్జికల్స్‌కు రూ.కోటి, డ్రగ్స్ సరఫరా ఏజెన్సీకి రూ.1.40 కోట్లు, ప్రింటింగ్‌కు రూ.10 లక్షలు, స్టేషనరీకి రూ.10 లక్షలు, మోకీలు మార్పిడి పరికరాలు పంపే సంస్థకు రూ.30 లక్షలు, గుండె సంబంధిత స్టంట్స్ సరఫరా సంస్థకు రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంది. వీటన్నింటినీ కలిపితే పెద్దాసుపత్రి అప్పుల భారం రూ.5 కోట్లు పైచిలుకు ఉంటుందని అంచనా. ఇవన్నీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేరుకుపోయిన బకాయిలే. ఆ మొత్తాన్ని చెల్లించాలని, లేదంటే అన్నింటినీ నిలిపి వేస్తామని ఏజెన్సీలు ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే ఇస్తాం’ అంటూ వైద్యాధికారులు చొరవతీసుకుంటూ రోజులను నెట్టుకొస్తున్నారు.
మోకీలు మార్పిడి శస్త్ర చికిత్స విభాగాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్‌కు వెళితే రూ.లక్షల్లో ఖర్చవుతోందని, అంతటి భారాన్ని పేద, మధ్యతరగతి వర్గాలు మోయలేవనే మంచి సంకల్పంతో అధునాతన పరికరాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయించింది. అయితే, ఆ విభాగానికి పరికరాలు సరఫరా చేసే ఏజెన్సీకి రెండేళ్లుగా రూ.లక్షల్లో బిల్లులు చెల్లించని కారణంగా ప్రస్తుతం మోకీలు మార్పిడి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆక్సిజన్, సర్జికల్స్ సరఫరా ఏజెన్సీలకు రూ.కోట్ల బకాయిలు చెల్లించాల్సిన నేపథ్యంలో వారు మొండికేస్తే దవాఖాన పరిస్థితి ఏంటనే ఆందోళనలో వైద్యులు ఉన్నారు.
కొద్దిరోజులు ఓపిక పట్టి తాము కూడా గుండె సంబంధిత స్టంట్స్ సరఫరాకు ‘నో స్టాక్’ బోర్డు తగిలిస్తామని సంబంధిత యజమాని తెగేసి చెప్పినట్లు సమాచారం. అదే జరిగితే కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం నిరుపేద రోగులకు ప్రాణ సంకటంగా మారుతుందనడంలో అతిశయోక్తి ఉండదు. పేరుకుపోయిన బకాయిల వివరాలతో కూడిన నివేదికలను, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సవాళ్లను అనేకమార్లు ప్రభుత్వానికి పంపించినా స్పందన లేకపోవడం వైద్యాధికారులకే విస్తుగొలుపుతోంది. దీర్ఘకాలిక రోగాలకు అవసరమైన మందుల కోసం అడపాదడపా బయటికి రాయాల్సి వస్తోందని ఓ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. అత్యవసర సమయాల్లో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తనకుండే ప్రత్యేక నిధుల నుంచి డబ్బులు ఇస్తే మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది.
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయాలని గతంలో అప్పటి సీఎం కేసీఆర్ వైద్యరంగంలో పలు కీలక మార్పులు చేశారు. దవాఖానాల్లోని ఆర్థో (ఎముకలు, కీళ్లు), గుండెకు స్టంట్లు, మోకీలు మార్పిడి, ప్రసవాలు వంటి విభాగాలను ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేశారు.
ప్రైవేట్‌కు చెల్లించే బదులు సర్కారు ఆసుపత్రులకు నిధులు బదలాయిస్తే పేద, మధ్యతరగతి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని సంకల్పించారు. కానీ, కాంగ్రెస్ పాలన వచ్చిన నాటి నుంచి ప్రభుత్వాసుపత్రులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఖమ్మం పెద్దాసుపత్రి అధికారుల అంచనా ప్రకారం ఆరోగ్యశ్రీ సేవల నిమిత్తం ప్రభుత్వం నుంచి దాదాపు రూ.12 కోట్లు రావాల్సి ఉంది.
వాటిల్లో సంపూర్ణంగా బిల్లులు సమర్పించినవే రూ.7 కోట్ల వరకు ఉన్నాయి. వాటి గురించి అనేకమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని యంత్రాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆరోగ్యశ్రీ బిల్లులు వచ్చినా, ప్రైవేట్ ఏజెన్సీలకు బకాయిలు చెల్లించడంతోపాటు ఆసుపత్రి అవసరాలను తామే తీర్చుకుంటామని పలువురు వైద్యులు వాపోతున్నారు. కాగా, నిరుపేదల ఆరోగ్యం పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ సర్కారుపై రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులుండి కూడా కనీసం దవాఖాన వైపు కన్నెత్తి చూడకపోవడం, వసతుల కల్పన పట్ల దృష్టిసారించక పోవడం పట్ల మండి పడుతున్నారు.