ముదిగొండ, జూలై 01 : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విభాగాల్లో ఫెయిల్ అయిందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రం ముదిగొండతో పాటు న్యూలక్ష్మీపురం, గంధసిరి, పెద్దమండమ గ్రామాల్లో మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావులతో కలిసి పర్యటించారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. వెంకటాపురం గ్రామంలోని బీఆర్ఎస్ నాయకుడు కోటి అనంతరాములు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
10 సంవత్సరాలు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నయో చూస్తే కాంగ్రెస్ పరిపాలన ఏ విధగా ఉందో అర్థం అవుతుందన్నారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల కిస్తీలు సరిగ్గా కట్టక బ్యాంకులు ట్రాక్టర్లను జప్తు చేసే పరిస్థితి నెలకొందన్నారు. డిజీల్ పోసే పరిస్థితి కూడా లేకపోవడంతో తిరగక తుప్పుపట్టి పోతున్నట్లు తెలిపారు. కేసీఆర్ పరిపాలనలో 240 గురుకుల పాఠశాలలను వెయ్యికి పెంచి కార్పోరేట్ కి ధీటుగా విద్యను అందించారన్నారు. కానీ ప్రస్తుతం 25 శాతం సీట్లు మిగిలాయని తెలిపారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఓట్ల కోసం వచ్చే వారిని హామీలపై నిలయదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని కోరారు.
అలివికాని హామీలు ఇచ్చి అవి అమలు చేయలేక కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు అన్నారు. పరిపాలనలో అన్ని విధాల ఫెయిలై ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి కమిషన్లు వేశారన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన సరుకులు ఏవీ సమయానికి అందడం లేదన్నారు. ముఖ్యమంత్రి వద్దే విద్యా శాఖ ఉన్నా ఎలాంటి సమీక్షలు జరగడం లేదన్నారు. విద్యా శాఖలో ప్రభుత్వానికి ఓ ఏజెంట్ ఉన్నాడని, అతని ద్వారానే అన్ని పనులు జరుగుతున్నట్లు తెలిపారు. వర్షాకాల సీజన్ ప్రారంభమైనా విత్తనాలు, ఎరువులపై సమీక్ష జరపలేదన్నారు. పంట బీమాకి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించలేదనీ, రైతు బీమా కూడా సరిగ్గా అందడంలేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే అవకాశం ఇప్పుడు ప్రజానీకానికి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపిపి సామినేని హరిప్రసాద్, నాయుకులు పోట్ల ప్రసాద్, గడ్డం వెంకటేశ్వర్లు, ఓరుగుంటి నాగేశ్వరరావు, ధర్మ, కాజా, కోటి అనంతరాములు, కొమ్మూరి రమేశ్, పంది శ్రీను, కోడెబాబు, గురుమూర్తి, పోట్ల రవి పాలొగన్నారు.