ఎర్రుపాలెం, అక్టోబర్ 08 : ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను, సమస్యలు పరిష్కరిస్తామని ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ అన్నారు. ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటి అమలుపై మాట దాటవేస్తోందని విమర్శించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత, ఉద్యోగులు, పట్టభద్రులు కాంగ్రెస్ పాలనపై తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నారని తెలిపారు. గురువారం ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ఇతర హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న యువతకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. పీఆర్సీ, డీఏలు, ఉద్యోగుల ఇతర సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలని సూచించారు. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట అన్న తీరును ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పట్టభద్రులు అన్ని అంశాలను పరిశీలించి ప్రభుత్వ పనితీరును ప్రశ్నించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు అత్యంత కీలకమని కమల్‌రాజ్ అన్నారు. గ్రామాల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని బూత్ ఏజెంట్లను ఆదేశించారు. ప్రతి ఇంటికీ వెళ్లి పట్టభద్రులను కలవాలని, ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. బూత్ స్థాయి నుంచే ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ శీలం కవిత, మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, తోట శ్రీనివాసరావు, సర్పంచ్ వేల్పుల బెంజిమెన్, నాయకులు గూడూరు రమణారెడ్డి, శేగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కుడుముల మల్లికార్జునరెడ్డి, బొర్ర నరసింహారావు, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, గద్దల శ్రీనివాసరావు, కోట లోకేష్, షేక్ హుస్సేన్, రామకృష్ణ, కోట శ్రీనివాసరావు, సంక్రాంతి కృష్ణారావు, నరేష్, వెంకట్ పాల్గొన్నారు.