ఖమ్మం ఎడ్యుకేషన్, మే 10: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్-2023 ఖమ్మం జిల్లాలో బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లాలోని 8 కేంద్రాల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున ఐదురోజుల పాటు ఆన్లైన్లో విధానంలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. తొలి రోజు పరీక్షలో 8 కేంద్రాల్లో ఉదయం 1,550 మంది విద్యార్థులకు 1,453 మంది విద్యార్థులు హాజరై 100 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 1,550 మందికి గాను 1,471 మంది విద్యార్థులు హాజరై 79 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 93 శాతం హాజరు నమోదైంది. ఖమ్మంలో 6 కేంద్రాలు, సత్తుపల్లిలో రెండు కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. పరీక్ష సమయానికి ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు.