ఖమ్మం, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన గ్రామ సభలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండలాల స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి సిబ్బంది దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆదివారం మూడో రోజు సైతం గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఉదయం, మధ్యాహ్నం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు ఏర్పాటు చేసి తహసీల్దార్, ఎంపీడీవోల ఆధ్వర్యంలో రెండు బృందాల ద్వారా సభలు నిర్వహించి అర్జీలు స్వీకరించారు. మధిరలో ఏర్పాటు చేసిన గ్రామ సభను కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. స్వయంగా కౌంటర్ల వద్దకు వెళ్లి సిబ్బంది స్వీకరించిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించారు. ఖమ్మం నగరం 14వ డివిజన్ మధురానగర్లో ఏర్పాటు చేసిన సభను పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఖమ్మం రూరల్ మండలంలో గ్రామ సభల ఏర్పాట్లు, ప్రజలకు కల్పించిన సౌకర్యాలపై స్పెషల్ ఆఫీసర్ జ్యోతి స్థానిక అధికారులు, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రాంపురం పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. టేకులపల్లి మండలం ప్రేగళ్ళపాడు పంచాయతీలో జరిగిన గ్రామ సభలో కలెక్టర్ ప్రియాంక ఆల పాల్గొన్నారు.
మణుగూరు మండలం రాజుపేటలో జరిగిన గ్రామ సభకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. అయితే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అధికారులు ఇప్పటివరకు వాటిని ఆన్లైన్ చేయడం లేదని తెలుస్తోంది. ప్రతి రోజు స్వీకరించిన దరఖాస్తులను ప్రస్తుతం మండల పరిషత్ కార్యాలయాల్లో భద్రపరుస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత సదరు దరఖాస్తులను నిర్దేశించిన వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. దరఖాస్తులు నింపే సమయంలో ప్రజలకు వచ్చిన సందేహాలను అధికారులు నివృత్తి చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు, ఇంట్లో ఒక్కరికంటే ఎక్కువగా ఉంటే మహాలక్ష్మి పింఛన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అయితే పింఛన్ పొందుతున్న వృద్ధులు, రైతుబంధు తీసుకుంటున్న రైతులు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం ప్రతి పథకానికి టిక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా.. ఆది, సోమవారం ప్రజా పాలన గ్రామ సభలకు సెలవు కాగా.. తిరిగి జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు సభలు కొనసాగే అవకాశం ఉంది.